కొండచరియలు విరిగిపడి.. ఉత్తరాఖండ్‌‌లో ఐదుగురు మృతి

కొండచరియలు విరిగిపడి.. ఉత్తరాఖండ్‌‌లో ఐదుగురు మృతి
  • కేదార్‌‌‌‌నాథ్‌‌కు వెళ్తుండగా ప్రమాదం

డెహ్రాడూన్‌‌: ఉత్తరాఖండ్‌‌లో కొండ చరియలు విరిగిపడి ఐదుగురు మృతి చెందారు. గుజరాత్‌‌కు చెందిన పర్యాటకులు కేదార్‌‌‌‌‌‌నాథ్‌‌కు వెళ్తుండగా, గురువారం రాత్రి రుద్రప్రయాగ్‌‌ జిల్లాలోని గుప్త కాశీ గౌరీకుండ్‌‌ హైవేపై కొండచరియలు విరిగి వీరి కారుపై పడ్డాయి. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న స్టేట్‌‌ డిజాస్టర్‌‌‌‌ రెస్పాన్స్‌‌ పోర్స్‌‌(ఎస్‌‌డీఆర్‌‌‌‌ఎఫ్‌‌) సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, కుండపోత వర్షం కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌‌కు ఆటంకం కలిగింది. శుక్రవారం వర్షం తగ్గడంతో శిథిలాల నుంచి డెడ్‌‌బాడీలను బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు గుజరాత్‌‌, ఇద్దరు హరిద్వార్‌‌‌‌కు చెందిన వ్యక్తులు ఉన్నారని వెల్లడించారు. రెండ్రోజుల క్రితం కూడా కొండచరియలు విరిగిపడి ఓ జంట గల్లంతయ్యింది. తాజాగా రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఆరెంజ్‌‌ అలర్ట్ జారీ చేసింది. వచ్చే మూడ్రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రెడ్‌‌ అలర్ట్  ప్రకటించింది.