రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి
  • పెద్దపల్లి జిల్లా కొలనూరులో ఇద్దరు
  • మక్తల్​లో మరో ఇద్దరు..
  • మెదక్​లో స్కూల్​ బస్సు కింద పడి చిన్నారి

సుల్తానాబాద్, వెలుగు:  పెద్దపల్లి, నారాయణపేట, మెదక్​ జిల్లాల్లో జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు చనిపోయారు. ఇందులో ఆరేండ్ల చిన్నారి  కూడా ఉంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ రైల్వే గేటు వద్ద గోపరపల్లి శివారులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పొత్కపల్లి ఎస్సై శ్రీధర్ కథనం ప్రకారం..సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుగ్లాంపల్లికి చెందిన పసెడ్ల సంజయ్, పెగడపల్లికి చెందిన జీల మహేశ్‌(18), గోపరపల్లికి చెందిన దాసరి వంశీకృష్ణారెడ్డి(20)  స్నేహితులు. వీరిలో సంజయ్ ​డిగ్రీ, మహేశ్, వంశీకృష్ణారెడ్డి ఇంటర్​చదువుతున్నారు. ముగ్గురు సోమవారం రాత్రి బైక్‌పై కొలనూరు వైపు వెళ్లారు. రైల్వే గేటు వద్ద గోపరపల్లి శివారులో మూలమలుపు వద్ద బైక్ అదుపు తప్పడంతో కింద పడిపోయారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని హాస్పిటల్‌కు తరలిస్తుండగా వంశీకృష్ణారెడ్డి చనిపోయాడు. మిగతా ఇద్దరిని కరీంనగర్‌‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తుండగా మంగళవారం మహేశ్ మరణించాడు. సంజయ్..సుల్తానాబాద్ కౌన్సిలర్ మమత కొడుకు. సంజయ్ ​అజాగ్రత్తగా, అతివేగంగా బైక్‌ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని వంశీ కృష్ణారెడ్డి తండ్రి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.  

మక్తల్​లో కారు, బైక్​ ఢీకొని మరో ఇద్దరు..

మక్తల్: నారాయణపేట జిల్లా మక్తల్  మండలం కాచ్ వార్  వద్ద 167వ జాతీయ రహదారిపై కారు, బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..హైదరాబాద్ కు చెందిన శివసాయి కర్నాటకలోని కడేచూర్​కు బీఎండబ్ల్యూ కారులో వెళ్తున్నాడు.  కాచ్ వార్ వద్ద పొలాల వైపు నుంచి రోడ్డుపైకి ఇద్దరు యువకులు బైక్​పై రావడంతో వేగంగా వెళ్తున్న కారు, బైకు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్​పై వెళ్తున్న మక్తల్ భరత్ నగర్ కు చెందిన భాను అలియాస్ ​బాల్​రాజ్ (34), ప్రభాకర్(35) చనిపోయారు. కారులో ఒక్కడే ఉండడం, బెలూన్లు ఓపెన్ ​కావడంతో శివసాయికి ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు స్పాట్​కు వచ్చేలోపే శివసాయి బాల్​రాజ్​, ప్రభాకర్​ను ఆటోలో మక్తల్​దవాఖానకు తరలించాడు. భాను మక్తల్​లోని డాక్టర్​ రవీందర్​రెడ్డి దగ్గర అటెండర్​గా పని చేస్తున్నాడు. భానుకు భార్య మమతతో పాటు ఇద్దరు కొడుకులు, ఓ బిడ్డ ఉన్నారు.  ప్రభాకర్​కు భార్య రాధతో  పాటు ఇద్దరు కొడుకులున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు.

మెదక్ టౌన్​, వెలుగు: మెదక్​ పట్టణంలోని తారకరామానగర్​ కాలనీలో మంగళవారం స్కూల్ బస్​ కింద పడి ఆరేండ్ల చిన్నారి చనిపోయింది. సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో ఉంటున్న నవీన, భిక్షపతి దంపతులకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. భార్యాభర్తలిద్దరు కంపెనీల్లో పనిచేస్తుండగా పెద్ద బిడ్డను కొల్చారంలోని నవీన తల్లిగారింట్లో, చిన్న కూతురు అనుశ్రీ(6) ని మెదక్ తారక రామానగర్​కాలనీలోని పిన్ని, బాబాయ్ దగ్గర ఉంచి చదివిస్తున్నారు. రోజు మాదిరిగానే స్కూల్​బస్సులో బడికి వెళ్లిన అనుశ్రీ సాయంత్రం అదే స్కూల్​బస్సులో వచ్చి ఇంటి దగ్గర దిగింది.

అనుశ్రీ అక్కడే నిలబడగా డ్రైవర్​ గమనించలేదు. ఆమె వెళ్లిపోయిందనుకుని బస్సును ముందుకు పోనివ్వగా వెనక టైర్​కింద పడింది. మళ్లీ రివర్స్​ తీయడంతో తీవ్రంగా గాయపడి కొద్దిసేపటికే కన్నుమూసింది. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు ప్రమాదానికి కారణమైన స్కూల్​బస్​అద్దాలు పగులగొట్టారు. బస్సులో పిల్లలను దించే వ్యక్తి లేకపోవడం, డ్రైవర్​ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. దీంతో పోలీసులు వచ్చి గొడవ జరగకుండా చూసుకున్నారు. ప్రమాదానికి కారణమైన స్కూల్​బస్​ను పీఎస్​కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.