ఐదుగురు మహిళా టెర్రరిస్టులు అరెస్ట్​

ఐదుగురు మహిళా టెర్రరిస్టులు అరెస్ట్​

పాకిస్తాన్ లో తొలిసారి మహిళా టెర్రరిస్టులను అరెస్ట్​ చేశారు పోలీసులు. పంజాబ్​ ప్రావిన్స్లో ఇస్లామిక్​ స్టేట్​ (ISIS​) ఉగ్రవాద సంస్థకు చెందిన ఐదుగురు మహిళా ఉగ్రవాదులను అరెస్ట్​ చేసినట్లు అధికారులు తెలిపారు. పక్కా సమాచారంలో లాహోర్, షేక్‌పురాకు చెందిన ఐదుగురు మహిళలను అరెస్టు చేసినట్లు పంజాబ్ పోలీసులకు చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (CTD) తెలిపింది. మహిళా టెర్రరిస్టుల నుంచి ఆయుధాలు, నగదు, నిషేధిత సాహిత్యం, సెల్​ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

అరెస్టయిన ఉగ్రవాదులను ఐమన్, జవేరియా, సాదియా, ఫైజా, ఫఖ్రాగా గుర్తించారు. వారిపై తీవ్రవాద కేసులు నమోదయ్యాయి. తదుపరి విచారణ కోసం వారిని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు.

సీటీడీ ఏకంగా ఐదుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి. గత నెల, CTD దేశవ్యాప్తంగా ముఖ్యమైన సంస్థాపనలు, మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్న 20 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసింది. వీరిలో ఎక్కువ మంది నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) , ISISకి చెందినవారు. 

గత ఏడాది నవంబర్‌లో పాకిస్తాన్ ప్రభుత్వం, టిటిపి మధ్య సంధి ముగిసింది. సంధి ముగిసిన తర్వాత దేశంలో భద్రతా బలగాలపై దాడులు పెరిగాయి. టిటిపి, ఐసిస్‌కు చెందిన వందలాది మంది ఉగ్రవాదులు పట్టుబడ్డారు.