
వందల ఏండ్ల కిందట ఫ్రాన్స్ రాజు చార్లెస్ ది గ్రేట్ ప్రజల ఆరోగ్యం కోసం అవిసె గింజలను తినమని చెప్పేవాడట. అంటే ఆరోగ్యాన్ని కాపాడటంలో అవిసె గింజలు అంతగా ఉపయోగపడుతున్నాయని అప్పటి నుంచే వాడేవారన్నమాట. అవిసె గింజల్లో ఒమెగా–-3 ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ. దీని వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి. వీటిలో లిగ్నాన్స్ అనే పోషకాలు ఉంటాయి. వీటిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలుంటాయి. అవి రొమ్ము , ప్రొస్టేట్ క్యాన్సర్‌తో పాటు ఇతర రకాల క్యాన్సర్లను నివారించడంలో సాయపడతాయి. రోజూ రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు తింటే... విటమిన్–బి అందుతుంది. చర్మం పొడిబారే తత్వాన్నితగ్గి, మృదువుగా అవుతుంది. పొడిబారే కళ్లతో ఇబ్బంది పడేవారు ఈ గింజల్ని తింటే ఫలితం ఉంటుంది. వీటిలో ఉన్న పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిని నేరుగా తినలేకపోతే... లడ్డూలు చేసుకొని తినొచ్చు. లేదా పొడిగా చేసి ఇడ్లీ, దోశ పిండిలో కలపొచ్చు. కూరల్లో వేసుకుని కూడా తినొచ్చు.