కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌ మధ్య ఫ్లెక్సీ వార్‌‌..నస్పూర్ పోలీస్‌‌ స్టేషన్‌‌లో పరస్పరం ఫిర్యాదులు

కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌ మధ్య ఫ్లెక్సీ వార్‌‌..నస్పూర్ పోలీస్‌‌ స్టేషన్‌‌లో పరస్పరం ఫిర్యాదులు

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా నస్పూర్‌‌లో కాంగ్రెస్, బీఆర్‌‌ఎస్‌‌ లీడర్ల మధ్య ఫ్లెక్సీ వార్‌‌ మొదలైంది. గొడవ కాస్తా ముదరడంతో ఇరు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... నస్పూర్‌‌కు చెందిన బీఆర్‌‌ఎస్‌‌ నాయకుడు బేర సత్యనారాయణ సీసీసీ నస్పూర్​చౌరస్తాలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. ఆ ఫ్లెక్సీని మంగళవారం రాత్రి కాంగ్రెస్​ లీడర్లు తొలగించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సత్యనారాయణ.. కాటమ రాజు, ప్రశాంత్‌‌ అనే కార్యకర్తలతో కలిసి నస్పూర్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌‌ నాయకులు భారీ సంఖ్యలో స్టేషన్‌‌ వద్దకు చేరుకొని బీఆర్ఎస్‌‌ లీడర్లపై దాడి చేశారు. కాంగ్రెస్‌‌ నాయకుల దాడి నుంచి సత్యనారాయణ, ప్రశాంత్‌‌ తప్పించుకొని స్టేషన్‌‌లోకి పరుగెత్తగా... కాటమ రాజును తీవ్రంగా కొట్టడంతో గాయాలయ్యాయి. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

మంచిర్యాలలో రౌడీ రాజ్యం : నడిపెల్లి దివాకర్‌‌రావు

మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్‌‌సాగర్‌‌రావు నేతృత్వంలో రౌడీ రాజ్యం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌‌రావు ఆరోపించారు. హాస్పిటల్‌‌లో చికిత్స పొందుతున్న కాటమ రాజును బుధవారం ఆయన పరామర్శించారు. పోలీస్‌‌స్టేషన్‌‌ వద్దే దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారు తప్ప ఆపేందుకు ప్రయత్నం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎమ్మెల్యే ప్రేమ్‌‌ సాగర్‌‌రావుకు వత్తాసు పలకడం మానుకోవాలన్నారు. మంచిర్యాలలో కొంతకాలంగా కొనసాగుతున్న దాడులపై పోలీస్‌‌ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరారు.