కేసీఆర్ ఫ్లెక్సీపై మోడీ ఫ్లెక్సీ

కేసీఆర్ ఫ్లెక్సీపై మోడీ ఫ్లెక్సీ

హైదరాబాద్ :- గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. మెట్రో పిల్లర్లకు ఉన్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలపై బీజేపీ నేతలు తమ పార్టీ ఫ్లెక్సీలను అతికించారు. హైదరాబాద్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో విజయ సంకల్ప సభకు సంబంధించిన ఫ్లెక్సీలను మెట్రో పిల్లర్లకు అతికించారు. గడ్డి అన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి సూచనతో  ఆ పార్టీ కార్యకర్తలు దిల్ సుఖ్ నగర్ నుండి చైతన్యపురి వరకు మెట్రో పిల్లర్లకు అంతకుముందే ఉన్న  సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలపై బీజేపీ ఫ్లెక్సీలను అతికించారు. దీనిపై టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. 

బీజేపీ నేతలకంటే  ముందే టీఆర్ఎస్ పార్టీ వాళ్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోలతో ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేస్తూ నగరమంతా ఫ్లెక్సీలతో నింపేశారు. ప్రధాని మోడీ పర్యటించే బేగంపేట, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్, HICC నోవాటెల్ ప్రాంతాల్లో భారీగా హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ప్రచారం కోసం యాడ్ ఏజెన్సీలను బీజేపీ సంప్రదించడంతో హోర్డింగ్స్ అన్నీ టీఆర్ఎస్ ముందుగానే బుక్ చేసుకుందని వెల్లడించాయి. తమ హోర్డింగ్స్ కు చాన్స్ ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం ఇలా ప్లాన్ చేసిందంటున్నారు బీజేపీ నేతలు. బీజేపీ వాళ్లకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలతో నగరమంతా హోర్డింగ్స్, ఫ్లెక్సీలతో టీఆర్ఎస్ వాళ్లు నింపేశారు. తమకు సరైన ప్రచారం రావొద్దనే టీఆర్ఎస్ ఈ విధంగా చేస్తోందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. 

ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో చాలా చోట్ల బీజేపీ, టీఆర్ఎస్ కు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ సహా అమిత్ షా, నడ్డాతో పాటు పార్టీ కీలక నేతలందరూ హైదరాబాద్ కు వచ్చారు. ఇదే క్రమంలో బీజేపీ కార్యవర్గ సమావేశాలకు పోటీగా టీఆర్ఎస్ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వచ్చిన సందర్భంగా నగరంలో చాలాచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. బేగంపేట ఏరియాలో ఎక్కడ చూసినా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల కటౌట్లు, హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. కావాలనే తమ పార్టీ, నాయకుల ఫ్లెక్సీలు కనబడకుండా కడుతున్నారని రెండు పార్టీల కార్యకర్తలు ఆరోపించుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు మోడీ వ్యతిరేక ఫ్లెక్సీలను రోడ్లపై  అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేశారు.  దీనికి పోటీగా బీజేపీ లీడర్లు మోడీ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారు. సాలు దొర- సెలవు దొర అంటూ బీజేపీ పెట్టిన హోర్డింగ్ కు కౌంటర్ గా పరేడ్ గ్రౌండ్స్ దగ్గర భారీ హోర్డింగ్ లను టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేశారు. సాలు మోడీ సంపకు మోడీ అనే స్లోగన్ తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈ ఫ్లెక్సీలను తొలగించారు.