శాలరీ కంటే వర్క్ ఫ్లెక్సిబిలిటీకే ఓటు

శాలరీ కంటే  వర్క్ ఫ్లెక్సిబిలిటీకే ఓటు

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు:  శాలరీ కంటే వర్క్‌‌ ఫ్లెక్సిబిలిటీకి జాబ్‌‌ సీకర్లు (ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారు) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశంలోని ప్రతి 10 మంది జాబ్‌‌ సీకర్లలో ఎనిమిది మంది టాప్ ప్రయారిటీ ఇదేనని  జాబ్‌‌ పోర్టల్‌‌ ఇండీడ్‌‌ ఓ సర్వేలో పేర్కొంది. ఉద్యోగాల కోసం వెతుకుతున్నవారు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారనే అంశంపై సంస్థ సర్వే చేసింది. సర్వేలో పాల్గొన్న వారిలో 71 శాతం మంది వర్క్ ఫ్లెక్సిబిలిటీకి ఓటేశారు. ఇంటి నుంచి పని చేయగలడం, నచ్చినప్పుడు పనిచేయడం, ఎప్పుడు నచ్చితే అప్పుడు సెలవు తీసుకోవడం వంటివి  వర్క్ ఫ్లెక్సిబిలిటీ కింద కోరుకుంటున్నారు. హైబ్రిడ్‌‌ లేదా రిమోట్‌‌ వర్క్‌‌ జాబ్స్‌‌కు   70 శాతం మంది జాబ్ సీకర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. పనిచేసే ఆఫీస్ లొకేషన్‌‌కు 69 శాతం మంది ప్రయారిటీ ఇస్తున్నారని,   ఆఫీస్‌‌కు, తాము ఉంటున్న  ఇంటికి  మధ్య   దూరాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారని  ఇండీడ్‌‌ వెల్లడించింది.   

సెకెండ్ ప్లేస్‌‌లో శాలరీ..

శాలరీ,  హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌, ఫ్యామిలీ లీవ్‌‌ పాలసీ, జాబ్‌‌ చేయడం వలన వచ్చే ఇతర బెనిఫిట్స్‌‌కు 67 శాతం మంది జాబ్ సీకర్లు ప్రాధాన్యం ఇస్తున్నారని ఇండీడ్‌‌ వివరించింది. ఉద్యోగం వెతుకుతున్నవారిలో 63 శాతం మంది హైబ్రిడ్ వర్క్ విధానంపై ఆసక్తిగా ఉన్నారని, అంటే కొన్ని రోజులు ఇంటి నుంచి, మరికొన్ని రోజులు ఆఫీస్ నుంచి పనిచేయడంపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని పేర్కొంది. పెద్ద కంపెనీలు కూడా హైబ్రిడ్ మోడల్‌‌ వర్క్ విధానానికి ఓకే చెబుతున్నాయి. 51 శాతం కంపెనీలు తాము రెడీ అని అంటున్నాయి. ట్యాలెంట్ ఉన్నవారిని ఆకర్షించాలంటే కంపెనీలు వివిధ బెనిఫిట్స్‌‌ను ఆఫర్ చేయాల్సి ఉంటుందని ఇండీడ్‌‌ ఇండియా సేల్స్ హెడ్‌‌ శశి కుమార్ అన్నారు.  ‘జాబ్ గురించి, ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి మరింత క్లారిటీ ఉంటే బాగుంటుందని జాబ్ సీకర్లు భావిస్తున్నారు. 

వర్గ, లింగ బేధాలు లేకుండా జాబ్ సెలెక్షన్ ప్రాసెస్ జరగాలని కోరుకుంటున్నారు’ అని వివరించారు. ఇంటర్వ్యూ  జరిగాక  10–-15 రోజుల్లో రిక్రూటర్ల నుంచి కాల్ వచ్చిందని 15 శాతం మంది జాబ్ సీకర్లు వెల్లడించగా, అంతకంటే ఎక్కువ టైమ్ పట్టిందని 63 శాతం మంది పేర్కొన్నారు. లేబర్‌‌‌‌ పనులు చేసే  బ్లూ కాలర్ వర్కర్లలో 82 శాతం మంది మాత్రం శాలరీ , ఇతర బెనిఫిట్స్‌‌కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. వారి జాబ్‌‌ రిస్క్‌‌తో కూడుకున్నది కాబట్టి  73 శాతం మంది ఫిజికల్‌‌ సేఫ్టీ ఉండాలని  కోరుకుంటున్నారు. మానసిక ఒత్తిడి తక్కువగా ఉండాలని 49 శాతం మంది వెల్లడించారు. కాగా,  ఈ ఏడాది మేలో ఈ సర్వేను ఇండీడ్‌‌ నిర్వహించింది. సర్వే కోసం 1,810 ఇండివిడ్యువల్స్‌‌, 561 కంపెనీలు,  1,249 జాబ్ సీకర్ల నుంచి అభిప్రాయాలు సేకరించింది.