ప్రజాపాలన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలు

ప్రజాపాలన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలు
  •     ప్రజాపాలన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలు
  •     ప్రభుత్వం మారినా.. పద్ధతి మార్చుకోని అధికారులు
  •     తీవ్రంగా మండిపడిన కాంగ్రెస్  లీడర్లు 

రామచంద్రాపురం/వెల్దుర్తి/పెనుబల్లి, వెలుగు :  ప్రభుత్వం మారినా అధికారులు తమ పద్ధతి మార్చుకోవడం లేదు. గురువారం ప్రజాపాలన కార్యక్రమంలో మాజీ సీఎం, మాజీ మంత్రులు, బీఆర్ఎస్  ఎంపీల ఫొటోలు పెట్టి కార్యక్రమాన్ని కొనసాగించారు. దీంతో అధికారుల తీరుపై కాంగ్రెస్​ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్  ప్రభుత్వం ఏర్పడి 20 రోజులు గడిచినా రామచంద్రాపురం జీహెచ్ఎంసీ అధికారులు ఇంకా బీఆర్ఎస్​ ప్రభుత్వం ఉందనే భ్రమలో ఉన్నారని సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్​ ఓబీసీ చైర్మన్​ మవీన్​ గౌడ్  ఫైర్  అయ్యారు. సీఎం, కాంగ్రెస్​ మంత్రుల ఫొటోలు పెట్టకుండా బీఆర్ఎస్  నేతల​ఫ్లెక్సీలు పెట్టి అధికారిక సమావేశం నిర్వహించడం పద్ధతి కాదన్నారు.

 రామచంద్రాపురం జీహెచ్ఎంసీ డివిజన్​ వార్డు కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్,  స్థానిక కార్పొరేటర్..​ కాంగ్రెస్​ ప్రభుత్వానికి కనీస మర్యాద ఇవ్వలేదని ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి ప్రొటోకాల్  పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రహ్మాలకుంట గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన సభలోనూ అధికారులు బీఆర్ఎస్​ ఎంపీల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. గ్రామసభలో ప్రభుత్వం నిర్ణయించినవి కాకుండా బీఆర్ఎస్​ ఎంపీలు, ఎమ్మెల్సీలతో కూడిన ఫ్లెక్సీని పెనుబల్లి ఎంపీడీఓ  శ్రీనివాసరావు ప్రదర్శింపజేశారు. 

అంతేకాకుండా మండలంలో అదనంగా బీఆర్ఎస్​ నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని జిల్లా ఎంపీడీఓల వాట్సాప్​ గ్రూపులో మెసేజ్​లు పంపారు. దీనిపై గ్రామస్తులు, స్థానిక కాంగ్రెస్​ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం ప్రభుత్వం నిర్ణయించిన ఫ్లెక్సీలను గ్రామసభలో పెడుతుంటే ఇక్కడ మాత్రం అదనంగా ఫ్లెక్సీలు ఎందుకు పెడుతున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్​ ఎంపీల ఫ్లెక్సీని తొలగించారు. దీనిపై సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్..​ ఎంపీడీఓ శ్రీనివాసరావును ఫోన్​లో వివరణ అడగగా.. కల్లూరు ఆర్డీఓ ఆదేశాలతో ఆ ఫ్లెక్సీ పెట్టామని తెలిపారు. అదనంగా పెట్టిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫ్లెక్సీలు మాత్రమే గ్రామసభలో ఉండాలన్నారు. 

ప్రోటోకాల్ పాటించలేదని ఎమ్మెల్యే ఆగ్రహం

ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తనను ఆహ్వానించిన అధికారులు తాను వచ్చేలోపే ప్రోగ్రాంని ప్రారంభించారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం వెల్దుర్తి మండలం మానెపల్లిలో ప్రజాపాలన గ్రామసభ ఏర్పాటు చేశారు. అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని, తమ తీరును మార్చుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను నెరవేర్చే దిశగా తాము పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ సభ్యుడు రమేశ్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.