కంటైనర్లనే దోచిన దొంగలు

కంటైనర్లనే దోచిన దొంగలు
  • రెండు జిల్లాల్లో డ్రైవర్లకు గన్నులు ఎక్కుపెట్టి దోపిడీ  
  • బాల్కొండ మండలంలో  డ్రైవర్​కు కత్తిపోట్లు 
  • యూపీ ముఠా పనిగా అనుమానాలు

నిజామాబాద్ క్రైమ్, వెలుగు : దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. భారీ కంటైనర్లను దారి కాచి దోచుకుపోతున్నారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు హల్దీరాం ప్యాకెట్స్ లోడ్ తో వెళ్తున్న భారీ కంటైనర్ ను నిర్మల్ జిల్లా ఇచ్చోడ వద్ద సోమవారం అర్ధరాత్రి కారును అడ్డుపెట్టి అడ్డుకున్నారు. ఏడుగురు దొంగలు డ్రైవర్ కు గన్ చూపి కండ్లకు గంతలు కట్టారు. డ్రైవర్​ను కారులో ఎక్కించుకుని కంటైనర్ ను నేషనల్​ హైవే వెంబడి బాల్కొండ మండలం శ్రీరాంపూర్ వరకు తీసుకువెళ్లారు. కంటైనర్​ ఖాళీ చేసి డ్రైవర్ ప్రఫుల్ ను కత్తితో పొడిచి పారిపోయారు. అతడి అరుపులు విన్న కొంతమంది అక్కడికి వచ్చి ఆర్మూర్ ఏరియా దవాఖానకు తరలించారు. ఇది యూపీ దొంగల ముఠా పని కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్ ఫిర్యాదుతో బాల్కొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

ఫ్లిప్​కార్టు కంటైనర్​కూడా..

పటాన్​చెరు : బాల్కొండ తరహా దోపిడీనే మంగళవారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లా బీడీఎల్​ పోలీస్​స్టేషన్​పరిధిలో కూడా జరిగింది. సీఐ వినాయక్​ రెడ్డి కథనం ప్రకారం.. బిహార్​కు చెందిన సత్తార్‌ తెల్లాపూర్‌ మున్సిపల్​పరిధిలో ఉంటున్నాడు. మూడేండ్లుగా ఫ్లిప్​కార్ట్​ కంటైనర్​ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం  ఎలక్ట్రానిక్​ గూడ్స్, ఇతర వస్తువులను తీసుకొని గజ్వేల్‌ బయలుదేరాడు. మంగళవారం తెల్లవారుజామున కర్దనూర్‌ సర్వీస్‌ రోడ్డు వద్ద వాహనానికి అడ్డంగా ముసుగులు ధరించిన ఐదుగురు కారు నిలిపారు. డ్రైవర్‌కు తుపాకీ చూపించి కిందికు దించారు. గంతలు కట్టి సుల్తాన్‌పూర్‌ తీసుకువెళ్లారు. అక్కడ కంటైనర్​ఆపి 20 బ్యాగుల్లోని రూ.1.78 లక్షల సామాన్లను ఎత్తుకెళ్లారు. డ్రైవర్​కు ఏ హానీ తలపెట్టలేదు. డ్రైవర్ ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.