అదానీతో ఫ్లిప్‌‌కార్ట్‌‌ జోడీ

అదానీతో ఫ్లిప్‌‌కార్ట్‌‌ జోడీ

న్యూఢిల్లీ: తమ రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, డేటా స్టోరేజీ కెపాసిటీని పెంచుకోవడం కోసం అదానీ గ్రూపుతో ఒప్పందాలు చేసుకున్నామని వాల్‌‌మార్ట్‌‌కు చెందిన ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌ ఫ్లిప్‌‌కార్ట్‌‌ ప్రకటించింది. దీనివల్ల 2,500 మందికి డైరెక్ట్‌‌ జాబ్స్‌‌ వస్తాయని వెల్లడించింది.  తన సప్లై చెయిన్‌‌ను బలోపేతం చేసుకోవడానికి, కస్టమర్లకు మరింత వేగంగా సేవలు అందించడానికి ఫ్లిప్‌‌కార్ట్‌‌.. అదానీ లాజిస్టిక్స్‌‌ లిమిటెడ్‌‌తో కలిసి పనిచేస్తుంది. చెన్నైలోని అదానీకనెక్స్‌‌లో ఫ్లిప్‌‌కార్ట్‌‌ ఒక డేటాసెంటర్‌‌ను కూడా ఏర్పాటు చేస్తుంది. అదానీకి ఈ రంగంలో ఉన్న నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటుంది.  అయితే ఈ డీల్‌‌ విలువను మాత్రం రెండు కంపెనీలూ వెల్లడించలేదు. ఈ ఒప్పందంలో భాగంగా అదానీ ముంబైలో ఫ్లిప్‌‌కార్ట్‌‌ కోసం 5.34 లక్షల చదరపు అడుగుల మేర గోదాములు నిర్మించి లీజు విధానంలో ఇస్తుంది. దీనివల్ల పశ్చిమ ఇండియాలో ఫ్లిప్‌‌కార్ట్‌‌ తన ఆన్‌‌లైన్‌‌ బిజినెస్‌‌ను మరింత పెంచుకుంటుంది.   వచ్చే ఏడాది మూడో క్వార్టర్‌‌లో గోదాము నిర్మాణం పూర్తవుతుంది. ఏ సమయంలో అయినా కోటి యూనిట్లను ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. దీనివల్ల 2,500 మంది లోకల్స్‌‌కు జాబ్స్ వస్తాయి. పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. చిన్న ఇండస్ట్రీలు ఎదగడానికి కూడా ఈ లాజిస్టిక్ హబ్‌‌ ఎంతగానో ఉపయోగపడుతుందని ఫ్లిప్‌‌కార్ట్‌‌ చెబుతోంది.  చెన్నై డేటా సెంటర్‌‌ను  ఇంటర్నేషనల్‌‌ లెవెల్‌‌ క్వాలిటీతో నిర్మించామని, డేటా సెక్యూరిటీకి ఢోకా ఉండదని అదానీ ప్రకటించింది. ఆర్‌‌బీఐ రూల్స్‌‌ ప్రకారం వాల్‌‌మార్ట్‌‌ వంటి విదేశీ కంపెనీలు తమ ఇండియా కస్టమర్ల డేటాను కచ్చితంగా లోకల్‌‌ సర్వర్లలోనే ఉంచాలి. అందుకే ఫ్లిప్‌‌కార్ట్‌‌ అదానీ డేటాసెంటర్‌‌ను ఉపయోగించుకుంటోంది. ఈ ఒప్పందం ఆత్మనిర్భర్‌‌ భారత్‌‌ కార్యక్రమానికి ఊతమిస్తుందని ఈ సందర్భంగా అదానీ పోర్ట్స్‌‌ అండ్‌‌ సెజ్‌‌ సీఈఓ కరణ్‌‌ అదానీ అన్నారు. అదానీ లాజిస్టిక్స్‌‌, రియల్టీ, గ్రీన్‌‌ ఎనర్జీ, డేటా సెంటర్‌‌ను ఉపయోగించుకుంటూ తమ బిజినెస్‌‌ను మరింత పెంచుకుంటామని ఫ్లిప్‌‌కార్ట్‌‌ సీఈఓ కల్యాణ్‌‌ కృష్ణమూర్తి ఈ సందర్భంగా అన్నారు. దీనివల్ల ఎన్నో చిన్న ఇండస్ట్రీలు, సెల్లర్లకు కూడా మేలు జరుగుతుందని చెప్పారు.
 

మరిన్ని వార్తలు