కళ్ళు తిప్పుకోనివ్వని 'ఫ్లోటింగ్​ సిటీ' అందాలు

కళ్ళు తిప్పుకోనివ్వని 'ఫ్లోటింగ్​ సిటీ' అందాలు

‘‘గాల్లో తేలినట్టుందే... ఒళ్ళు తూలినట్టుందే..” అని పాడుకున్నాడు ఒక సినిమాలో హీరో. మనుషులు సరే.. ఇండ్లు గాల్లోనో, నీళ్ళలోనే తేలితే ఎలా ఉంటుంది? భలేగా ఉంటుంది కదూ? గాల్లో తేలే ఇండ్ల సంగతైతే ఏమోగానీ, నీళ్ళలో తేలే ఇండ్లైతే అక్కడక్కడ కనిపిస్తాయ్​. అయితే, ఒకటి రెండు ఇండ్లు కాకుండా మరికొన్ని రోజుల్లో ఏకంగా నీళ్ళపై తేలే ఒక పెద్ద నగరాన్నే చూడొచ్చు. ఎక్కడ? ఎప్పుడు? అంటారా? అయితే, ఇది చదివేయండి.   

మనదేశానికి నైరుతి దిక్కున, హిందూ మహాసముద్రంలో ఉంటుంది మాల్దీవులు. పదకొండు వందల చిన్న చిన్న దీవులతో ఏర్పడిన దేశమిది. చుట్టూ నీలి రంగులోని సముద్ర జలాలు, వందలాది అందమైన బీచ్​లు, రిసార్ట్స్​, వేలాది కొబ్బరి చెట్లు, పగడపు దిబ్బలు, రంగురంగుల అరుదైన చేపలు, రొయ్యలు, తాబేళ్లు, ఆల్చిప్పలు.. ఒక్కటేమిటి ఇక్కడి అందాలు కళ్ళు తిప్పుకోనివ్వవు. అందుకే ఏటా ఇక్కడికి లక్షల మంది టూరిస్టులు వస్తుంటారు. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటల హనీమూన్​ డెస్టినేషన్​ ఇదే. కానీ, ఇప్పుడు ఈ దేశాన్ని గ్లోబల్​ వార్మింగ్​ భయపెడుతోంది. కారణం, ఇక్కడి దీవులన్నీ సముద్రమట్టానికి కేవలం రెండు మీటర్ల ఎత్తులో ఉండడమే. పెరుగుతున్న సముద్రమట్టాల కారణంగా ఈ దేశంలోని చాలా దీవులు 2050 నాటికి నీటిలో మునిగిపోతాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది కూడా. దాంతో ముప్పు తప్పించుకోవడానికి దారులు వెతుకుతోంది మాల్దీవ్స్​. ఆ ప్రయత్నంలో పుట్టిన ప్రాజెక్టే ‘ఫ్లోటింగ్​ సిటీ’. అంటే నీళ్ళపై తేలే నగరం.  
ఈ ఫ్లోటింగ్​ సిటీని నెదర్లాండ్స్​కు చెందిన ‘డచ్​ డాక్​ల్యాండ్స్​’ కంపెనీతో కలసి మాల్దీవ్స్ గవర్నమెంట్ కట్టబోతోంది. సిటీ డిజైన్​ను నెదర్లాండ్స్​కే చెందిన ‘వాటర్​స్టూడియో’ కంపెనీకి ఇచ్చింది. ఈ డిజైన్​ మనిషి మెదడు పైభాగం మాదిరి ఉంది. అందుకే దీన్ని ‘బ్రెయిన్​ కోరల్​’ అంటున్నారు. ఫ్లోటింగ్​ సిటీని2024 కల్లా కట్టేయాలనేది టార్గెట్.   

ఎలా ఉంటుందంటే.

తీరానికి ఆనుకొని, సుమారు 500 ఎకరాల్లోని ఒక కృత్రిమ సరస్సులో ఫ్లోటింగ్​ సిటీ కడతారు. దీని పేరు మాల్దీవ్స్​ ఫ్లోటింగ్​ సిటీ(ఎంఎఫ్​సీ). ఇందులో సుమారు ఐదు వేల ఇండ్లు ఉంటాయి. ఇవన్నీ నీళ్లపై తేలుతుంటాయి. ఇండ్లను రెసిడెన్షియల్​ కమ్యూనిటీలుగా విభజించి, ఒకదానికొకటి కలుపుతారు. వీటి మధ్య కెనాల్స్​ ఉంటాయి. అలాగే ఈ సిటీలో స్కూల్స్​, హాస్పిటల్స్​, షాప్స్​, రెస్టారెంట్స్, హోటల్స్​, పార్కులు, థియేటర్లు కూడా ఉంటాయి. వీటన్నింటినీ వాటర్​ప్రూఫ్​ మెటీరియల్​తో కడతారు. సిటీలోకి రావాలంటే కేవలం పడవలు మాత్రమే ఉపయోగించాలి. లోపల సైకిల్స్, సౌండ్​ చేయని ఎలక్ట్రిక్​ బైక్స్​ మీదే తిరగాలి. కార్లకు అనుమతి లేదు. ఫ్లోటింగ్​ సిటీ చుట్టూ కృత్రిమ పగడపు దిబ్బలు ఏర్పాటుచేస్తారు. వాటివల్ల అలల వేగం తగ్గుతుంది. సోలార్​తో కరెంట్​ ఏర్పాటు చేస్తారు. అలాగే సముద్రంలోని జీవులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. నీళ్ళపై తేలే ఈ నగరం మాల్దీవుల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉంటుంది. ఇందులో 20వేల మంది ఉండొచ్చు. ఇక్కడ ఎవరైనా ఇండ్లు కొనుక్కోవచ్చు. అలా కొనుక్కున్నవాళ్ళకు మాల్దీవుల పౌరసత్వం కూడా ఇస్తారు. అంతేకాదు, ఈ సిటీకి కావాల్సిన రక్షణను మాల్దీవుల గవర్నమెంట్ చూసుకుంటుంది.  మాల్దీవుల రాజధాని మాలె నుంచి కేవలం 10 నిమిషాల్లో ఈ ఫ్లోటింగ్​ సిటీకి చేరుకోవచ్చు.