దేశంలో సహకార మార్కెటింగ్: మధ్యవర్తుల దోపిడీకి చెక్.. రైతులకు ప్రయోజనాలు ఇలా..

 దేశంలో సహకార మార్కెటింగ్: మధ్యవర్తుల దోపిడీకి చెక్..  రైతులకు ప్రయోజనాలు ఇలా..

రైతులు సహకార ప్రాతిపదికపై మార్కెటింగ్ సంఘాలుగా ఏర్పడి తమ వస్తువులను విక్రయించుకొనే విధానమే సహకార మార్కెటింగ్. 1912లో రుణేతర రంగాల్లో కూడా సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి చట్టం చేయడంతో, కర్ణాటకలో తొలి సహకార మార్కెటింగ్ సంఘం 1915లో ప్రారంభమైంది. 1954కు ముందు వరకు సహకార మార్కెటింగ్ సంఘాలు ఒక ప్రత్యేక వ్యవస్థగా పనిచేసేవి. 1954 తర్వాత విడివిడిగా కాకుండా రుణాలు, మార్కెటింగ్ కార్యకలాపాలను రెండింటినీ ఒకే సహకార సంఘం నిర్వహించేలా బహుళార్థక సహకార సంఘాలుగా పనిచేయడం ప్రారంభించాయి.

ప్రయోజనాలు
బేరమాడే శక్తి: రైతులు సంఘటితం కావడం వల్ల బేరమాడే శక్తి పెరుగుతుంది.

కొనుగోలుదారునితో ప్రత్యక్ష సంబంధం: మధ్యవర్తులు లేకుండా నేరుగా కొనేవారికే తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు. ఫలితంగా సరైన ధర లభిస్తుంది.

గిడ్డంగి సౌకర్యాలు: సొంతంగా గిడ్డంగుల సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఫలితంగా నిల్వ సమయంలో జరిగే నష్టం తగ్గుతుంది.

రుణ సదుపాయం: తక్కువ వడ్డీకి రుణాలను సంస్థాగత మార్గాల్లో పొందవచ్చు.

సులభ, చౌక రవాణా: పెద్ద మొత్తంలో ఉత్పత్తులను రవాణా చేయడం వల్ల రవాణా వ్యయం తగ్గుతుంది.

గ్రేడింగ్, ప్రామాణీకరణ: సహకార సంస్థల ద్వారా నాణ్యత ఆధారంగా గ్రేడింగ్, ప్రామాణీకరణ సదుపాయాలు పొందవచ్చు.

మార్కెట్ సమాచారం: మార్కెట్ ఒడిదుడుకులు, ధరల సమాచారాన్ని సులభంగా పొందవచ్చు.

మార్కెట్ ధరలు: మార్కెట్ ధరలను ప్రభావితం చేసే స్థాయికి రైతులు ఎదుగుతారు.

ఉత్పాదకాలు, వినియోగ వస్తువులు: ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు వంటి ఉత్పాదకాలను తక్కువ ధరకే నాణ్యమైనవి పొందవచ్చు.

వ్యవసాయ ఉత్పత్తుల ప్రక్రియ: ఉత్పత్తులను నేరుగా అమ్మడంతోపాటు ప్రాసెసింగ్​నూ చేపట్టవచ్చు.

దేశంలో సహకార మార్కెటింగ్ ప్రగతి
రైతులు సహకార మార్కెటింగ్ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని తమ మిగులు ఉత్పత్తులను సంఘానికి విక్రయిస్తారు. సంఘం వారికి కొంత ముందస్తు ధనం ఇస్తుంది. సంఘం సేకరించిన ఉత్పత్తులను టోకు వ్యాపారులకు నేరుగా విక్రయిస్తుంది. అవసరమైతే గిడ్డంగుల్లో కొంతకాలం నిల్వ చేస్తుంది. విక్రయించిన తర్వాత వచ్చిన మొత్తాన్ని అడ్వాన్స్ పోగా మిగిలినది రైతులకు చెల్లిస్తుంది.

నిర్మాణం: సహకార మార్కెటింగ్ నిర్మాణం రెండు రకాలుగా ఉంటుంది. 

రెండంచెల విధానం: ఇందులో ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక సంఘాలు, రాష్ట్రస్థాయిలో రాష్ట్ర సహకార మార్కెటింగ్ సంఘం ఉంటాయి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో ఈ విధానమే ఉన్నది.

మూడంచెల విధానం: కొన్ని రాష్ట్రాల్లో ప్రాథమిక, రాష్ట్ర స్థాయిల మధ్యలో 'జిల్లా కేంద్ర మార్కెటింగ్ సంఘాలు' కూడా ఉంటాయి.

కీలక సంస్థలు
నేషనల్ కో-–ఆపరేటివ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్: పార్లమెంట్ చట్టం ద్వారా1963లో ఈ సంస్థ ఏర్పడింది. వ్యవసాయ వస్తువుల ప్రాసెసింగ్, నిల్వ, గ్రేడింగ్, మార్కెటింగ్ కోసం ప్రణాళికలు రూపొందిస్తుంది. సహకార రంగంలో చక్కెర పరిశ్రమలు అధిక శాతం దీని సహకారంతోనే పనిచేస్తున్నాయి.

నాఫెడ్ 
ఈ సంస్థ సహకార మార్కెటింగ్ వ్యవస్థలో అత్యున్నత సంస్థ. నాఫెడ్​ను 1958, అక్టోబర్ 2న నెలకొల్పారు. పప్పుధాన్యాలు, ఉల్లిపాయలు, అల్లం, మిరియాలు మొదలైన వస్తువుల సేకరణ, పంపిణీ, ఎగుమతి, దిగుమతులను నిర్వహించే అతి పెద్ద సంస్థ ఇది. ఈ సంస్థ మార్కెట్‌‌‌‌లో ధరల స్థిరీకరణకు దోహదపడుతుంది.

 ట్రైఫెడ్ 
ఇది 1987లో ప్రారంభమైంది. గిరిజనుల అటవీ, వ్యవసాయోత్పత్తులను ప్రైవేట్ వ్యాపారస్తుల దోపిడీ నుంచి రక్షించేందుకు దీన్ని స్థాపించారు. వరి, గోధుమ సేకరణలో ఎఫ్​సీఐకి ట్రైఫెడ్ ఏజెంట్​గా పనిచేస్తుంది.

మార్కెటింగ్ రకాలు
ప్రాథమిక మార్కెట్లు (సంతలు): నిర్ణీత రోజుల్లో జరిగే ఈ సంతల్లో విక్రయం కాగల మిగుల్లో 50 శాతం అమ్ముడవుతుంది. వీటిని దక్షిణాదిలో 'షాండీలు' అని, ఉత్తరాదిన 'హాట్' లేదా 'బజార్ల'ని అంటారు.

ద్వితీయ మార్కెట్లు (మండీలు): వీటిని టోకు మార్కెట్లు అంటారు. ఇక్కడ నిల్వ, బ్యాంకింగ్ వసతులు ఉంటాయి.

అంతిమ మార్కెట్లు: ఇవి పెద్ద నగరాల్లో ఉంటాయి. వినియోగదారులకు లేదా ప్రాసెసింగ్ యూనిట్లకు వస్తువులను చేర్చడం వీటి పని.

సంతలు: పండుగలు, యాత్రా స్థలాల్లో పశువుల విక్రయంతో సహా జరిగే ప్రత్యేక మార్కెట్లు.

క్రమబద్ధమైన మార్కెట్లు: అక్రమాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని ఏర్పాటు చేస్తాయి.

విక్రయం కాగల మిగులు: రైతు పండించిన పంటలో సొంత వినియోగం, విత్తనాల అవసరాలు పోగా మార్కెట్లో అమ్మడానికి సిద్ధంగా ఉన్న ఉత్పత్తిని 'విక్రయం కాగల మిగులు' అంటారు.