
- టీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
- పలు జిల్లాలో పర్యటించి పనులు పర్యవేక్షణ
హనుమకొండసిటీ,వెలుగు : వరదలతో కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని టీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. గురువారం వరద ముంపునకు గురైన కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఆయన పర్యటించారు.
నిజామాబాద్ సర్కిల్ పరిధిలో108 విద్యుత్ స్తంభాలు నేలకూలాయని, ఇందులో 87 పునరుద్ధరించామని చెప్పారు. 21 ట్రాన్స్ ఫార్మర్లు దెబ్బతినగా, అందులో 17 రిపేర్ చేశామన్నారు. 86 ట్రాన్స్ ఫార్మర్లు నీట మునిగిపోగా, వాటిలో 6 మరమ్మతు చేశామన్నారు. నిజామాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి సబ్ స్టేషన్ ను ,ఇందల్వాయి సెక్షన్ లోని గన్నారం సబ్ స్టేషన్ ను సందర్శించారు.
కరీంనగర్ సర్కిల్ ఆఫీసులో లోడ్ మానిటరింగ్ సెల్ (కంట్రోల్ రూమ్ ) ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా, సబ్ స్టేషన్ల పనితీరు, స్తంభాలు , లైన్ల పనితీరును తనిఖీ చేశారు. వరద ముంపుప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు సిబ్బంది నిరంతరం పని చేస్తున్నారని, ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.