
- తెల్లవారుజాము నుంచే బాధితుల క్యూ
- ఏండ్లు తిరిగినా గత ప్రభుత్వం సమస్యలను పరిష్కరించలేదని ఆగ్రహం
- కొత్త సర్కార్ అయినా పట్టించుకోవాలి
- రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన బాధితల వేడుకోలు
బేగంపేట, వెలుగు : మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామునే ప్రజాభవన్ వద్దకు చేరుకుని.. చలిని సైత లెక్కచేయకుండా క్యూ లైన్లలో నిలబడ్డారు.
వారిని ఉదయం 8 గంటల నుంచి అధికారులు లోపలకు అనుమతించారు. ఫిర్యాదుల్లో ఎక్కువశాతం డబుల్ బెడ్రూం ఇండ్లు, భూ సమస్యలు, ఉద్యోగుస్తుల సమస్యలు ఉన్నాయి. ఏండ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పరిష్కరించడంలేదని కొందరు బాధితులు వాపోయారు. ముఖ్యమంత్రికి అర్జీ ఇచ్చేందుకు వచ్చామని తెలిపారు. శుక్రవారం ప్రజావాణికి 4 వేలకు పైగా దరఖాస్తులు రాగా... నోడల్ ఆఫీసర్ దాసరి హరిచందన, బల్దియా కమిషనర్ రోనాల్డ్‌రాస్ స్వీకరించారు.
రూ. 70 లక్షలు, భూమి ఇచ్చినట్టు ప్రచారం
తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 ఆగస్టులో రైల్ రోకోలో పాల్గొన్న. రైలుకు ఎదురెళ్లి రెండు కాళ్లు, ఎడమ చేయిని పొగొట్టుకున్నా. డిగ్రీ చదివిన నాకు గత బీఆర్ఎస్ సర్కార్ ఆర్థికసాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం, సాగు భూమి ఇస్తామని మాజీ మంత్రులు కేటీఆర్,హరీశ్‌రావు హామీ ఇచ్చారు. అయితే, ఆర్థిక సాయంగా రూ.10 లక్షలు ఇచ్చారు. కానీ... సోషల్ మీడియాలో రూ.70 లక్షలు, 3 ఎకరాల భూమి ఇచ్చినట్లు ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆదుకొని నాకు జాబ్ ఇవ్వాలి.
– పిడమర్తి నాగరాజు, రాయనిగూడెం, హుజూర్ నగర్
ఆరోగ్యశ్రీ మంజూరు చేయాలి
ఆరోగ్యశ్రీ లేకపోవడంతో ఇబ్బందిపడుతున్నా. దివ్యాంగ పెన్షన్ మాత్రమే వస్తుంది. రేషన్ కార్డులో పేరు లేకపోవడంతో ఆరోగ్య శ్రీ వర్తించడం లేదు. కొత్త ప్రభుత్వం మంజూరయ్యేలా చూడాలి.
-పి. ఆనంద్, బోడుప్పల్, దివ్యాంగుడు
కొవిడ్ సాయం అందలేదు
కరోనా టైమ్‌లో నా తల్లి అనసూయ వైరస్ బారిన పడి మృతి చెందింది. ప్రభుత్వం నుంచి రూ. లక్ష ఆర్థిక సాయంగా రావాల్సి ఉన్నా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం.
– కె. హన్మంతరావు, ఎస్ఆర్నగర్
317 జీవోతో స్థానికత కోల్పోయాం
పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు 317 జీవోతో స్థానికత కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2021 లో తీసుకొచ్చిన జీవో కారణంగా సొంత జిల్లాల నుంచి 400 కి.మీ దూరం వేశారు. జీవోను రద్దు చేసినా లేకుంటే సవరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వినతిపత్రం ఇచ్చాం.
– శ్రీనివాస్, వెటర్నరీ శాఖ ఉద్యోగి
వీఆర్ఏలను మాతృసంస్థకు మార్చాలి
గత ప్రభుత్వం రెవెన్యూలో ఉన్న తమను వేరే డిపార్ట్మెంట్కు బదిలీ చేసింది. 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల మంది వీఆర్ ఏ లు ఉన్నారు. వారిని తిరిగి రెవెన్యూలోకి తీసుకోవాలని కోరుతూ ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చాం.
– నవీన్‌కుమార్, రాకేశ్, కృష్ణ(వీఆర్ఏలు)
రెగ్యులరైజ్ చేయాలి
మెడికల్ అండ్ హెల్త్ విభాగంలో 18 ఏండ్లుగా కాంట్రాక్టుపై విధులు నిర్వహిస్తున్నాం. చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఎందరో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించాలి.
– స్వప్నరెడ్డి, మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్
తొలగించిన హోంగార్డులను విధుల్లోకి తీసుకోవాలి
ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయంగా తొలగించిన 250 మంది హోంగార్డులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ప్రజావాణిలో సిటీహోంగార్డ్స్వినతి పత్రం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మమ్మల్ని ఆంధ్ర అధికారులు కక్షకట్టి ఆర్డర్ కాపీలు లేవనే సాకు చూపించి తొలగించారు. అందుకే కొత్త ప్రభుత్వంలో పరిష్కారం చూపాలని కోరేందుకు ప్రజావాణికి వచ్చాను.
– బి. బురాన్ గౌడ్, సమ్మయ్య నాయక్