ఊరిడిసి పోలేరు.. ఊళ్లో ఉండలేరు..!

ఊరిడిసి పోలేరు..  ఊళ్లో ఉండలేరు..!
  •     చెగ్యాంలో 135 కుటుంబాలకు అందని పరిహారం 
  •     శిథిలావస్థలో బాధితుల ఇండ్లు
  •     వర్షాకాలంలో పునరావాస కేంద్రాలకు తరలింపు
  •     మూడు సార్లు సర్వే చేసినా తీవ్ర జాప్యం

జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా వెల్గటూర్​ మండలం చెగ్యాంలో ముంపు బాధితులకు ఇంకా పరిహారం అందలేదు. 15 ఏండ్లుగా నష్టపరిహారం కోసం ఎదురు చూస్తూ కనిపించిన బాధితులకు లీడర్ల కాళ్ల వేళ్ల పడుతున్నారు. మరోవైపు గోదావరిలో పెరుగుతున్న వరద చెగ్యాం గ్రామ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గ్రామంలోకి నీరు వస్తుండడంతో క్షణ క్షణం భయంగా గడుపుతున్నారు. పరిహారం ఇవ్వకుండా శాశ్వత పునరావాసం ఏర్పాటు  చేయకపోవడంతో ఊరిడిసి పోలేక.. ఊళ్లో ఉండలేక పోతున్నామని ముంపు బాధితులు వాపోతున్నారు. ఆఫీసర్లు ఏళ్లుగా సర్వేల పేరుతో కాలయాపన చేయడంతో వందకుపైగా కుటుంబాలు పరిహారం కోసం ఎదురుచూస్తున్నాయి. ఏటా వర్షాకాలంలో బడిలో తలదాచుకోవడం, ఎవరైనా ఆహార పొట్లాలు ఇస్తే తింటూ గడుపుతున్నామని బాధితులు వాపోతున్నారు.  

2007లో ముంపు గ్రామాల గుర్తింపు :

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం భూసేకరణ లో భాగంగా 2007 లో బ్యాక్ వాటర్ ప్రభావిత ప్రాంతాలుగా వెల్గటూర్ మండలం కోటి లింగాల, మొక్కట్రావ్‌పేట్, రాంనూర్, చెగ్యాం, తాళ్ల కొత్తపేట్ గ్రామాలను గుర్తించారు. ఈ మేరకు చెగ్యాం గ్రామంలో కొందరు మినహా కోటిలింగాల గ్రామంలో 4.36  ఎకరాలు, 109 నిర్మాణాలకు రూ.5.35 కోట్లు, తాళ్లకొత్తపేట్ 20.15 ఎకరాలు, 207 నిర్మాణాలకు రూ.4.25 కోట్లు, రాంనూర్ 16.31 ఎకరాలు, 74 నిర్మాణాలకు రూ.7.72 కోట్లు, మొక్కరావుపేట్‌లో 97 నిర్మాణాలకు రూ.1.96 కోట్లు అందజేశారు. 

చెల్లింపులు పెండింగ్​

చెగ్యాం 62.05 ఎకరాల భూమితోపాటు 933 నిర్మాణాలకు పరిహారం అందజేయాలని నివేదికలు రూపొందించారు. కాగా సర్వేలో కొందరు స్థానిక లీడర్లు ఆఫీసర్లను ప్రలోభాలకు గురిచేయడంతో అవకతవకలు జరిగినట్లు విమర్శలున్నాయి. ఈ అవకతవకల్లో సరైన పరిహారం అందడం లేదని మరోసారి సర్వే చేయాలని బాధితులు డిమాండ్ చేశారు.  దీంతో ఇందులో 798 నిర్మాణాలకు గానూ రూ. 75.44 కోట్లు అందజేశారు. మిగిలిన 135 నిర్మాణాలకు రూ. 28.75 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. 

రిలే నిరాహార దీక్ష 

ఈ నెల 29 నుంచి తమకు సర్కార్ పరిహారం అందజేయాలని డిమాండ్ చేస్తూ వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలో ముంపు బాధితులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రీసర్వే కోసం వివిధ శాఖల అధికారులతో కమిటీలు వేసి మీటింగ్‌లు పెట్టినా అడుగు ముందుకు పడటం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు సర్వే చేసిన ఆఫీసర్లు రిపోర్టు ఇయ్యడంలో జాప్యం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

పరిహారం కోసం ఎదురుచూస్తున్నాం.. 

ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపు గ్రామం కింద ఆఫీసర్లు పరిహారం ఇస్తామని చెప్పి ఐదేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నాం. రేపుమాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నరు. వరదలు వస్తే ఊరు ఖాళీ చేపిస్తున్నరు. వానలు తగ్గినంక మళ్లీ ఊర్లకు పోతున్నాం. చిన్న పిల్లలతో అరిగోస పడుతున్నాం. తరచూ పాములు వస్తున్నాయి. సర్కార్ ఆదుకోవాలే.

– వంగపెల్లి రాజమ్మ, బాధితురాలు

గోడలు కూలుతున్నాయ్..

వరదలు వస్తే మా ఇల్లు మునిగిపోతుంది. వరద దాటికి గోడలు బీటలు పారి కూలిపోతున్నాయి. ఉండేందుకు వసతులు కూడా చూపించడం లేదు. పరిహారం మాకు ఇస్తే ఇల్లు కట్టుకుని బతుకుతాం. దినదిన గండంగా దుర్భర జీవితాలు గడుపుతున్నాం. వరదలు వస్తే పాత బడికి పంపిస్తున్నారు. ఆఫీసర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. 

- బీబీ బేగం, ముంపు బాధితురాలు