10వేల కోసం పడిగాపులు.. మీసేవ వద్ద క్యూలు

10వేల కోసం పడిగాపులు.. మీసేవ వద్ద క్యూలు

గ్రేటర్ హైదరాబాద్ లో సాయం కోసం వరద బాధితుల కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. తెల్లవారక ముందే మీ సేవ సెంటర్ల ముందు క్యూ కడుతున్నారు బాధితులు. దరఖాస్తులు పట్టుకొని గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. మహిళలతో పాటు చిన్నపిల్లలు, వృద్ధులు కూడా గంటలకొద్దీ లైన్లలో నిలబడుతున్నారు. కొన్ని ఏరియాల్లో సర్వర్ ప్రాబ్లమ్ జనాన్ని మరింత ఇబ్బంది పెడుతోంది. దీంతో గంటల తరబడి మీ సేవ సెంటర్ల దగ్గరే ఉండాల్సి వస్తోంది.  సర్వర్ ప్రాబ్లమ్ తో కిలీమీటర్ల మేర క్యూలైన్లు పెరిగి భారీగా ట్రాఫిక్ జాం అవుతోంది.

10 వేల సాయం కోసం . అల్వాల్, జవహార్ నగర్ లోని మీ సేవ సెంటర్ దగ్గరకు భారీగా చేరుకున్నారు బాధితులు. ముందుగా టోకెన్లు ఇచ్చిన  మీసేవ సిబ్బంది… ఆ తర్వాత అవి పనిచేయటం లేదని చెప్పారు.. తప్పని సరిగా క్యూ లైన్లో నిలబడాలని చెబుతున్నారు. దీంతో మీ సేవ సెంటర్స్ దగ్గర కిలో మీటర్ మేర క్యూ లైన్లో వేచి చూస్తున్నారు వదర బాధితులు. క్యూ లైన్లలో చంటి పిల్లలతోని అవస్థలు పడుతున్నారు. వృద్ధులు గంటల తరబడి నిలబడలేక నిరసించి పోతున్నారు. మీ సేవ సెంటర్లలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కుషాయిగూడ డివిజన్ లో ఆందోళనకు దిగారు వరద బాధితులు. గంటల తరబడి క్యూ లైన్లో  ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో మీటర్ మేర క్యూ లైన్ ఉన్నా… ఎవరు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో మీటర్ల క్యూ లైన్లో ఎవరికైనా… కరోనా ఉంటే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు వరద బాధితులు. దీంతో రోడ్డుపై బైఠాయించిన బాధితులు… కరోనా టైంలో డబ్బులు ఎకౌంట్లో వేసినట్లు… బాధితులకు కూడా డబ్బులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ రోడ్డుపై కిలో మీటర్ దాటి క్యూ లైన్ ఉంది.  వరద సాయం కోసం పడిగాపులు గాస్తున్నారు బాధితులు. తెల్లవారుజాము నుంచే మీ సేవ సెంటర్స్ దగ్గర క్యూ లైన్లో నిలబడ్డారు.