ఆదుకున్నవర్షాలు .. కడెం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

ఆదుకున్నవర్షాలు .. కడెం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల
  • ప్రాజెక్టుల్లోకి చేరుతున్న వరద
  • మూడు రోజుల్లో మారిన పరిస్థితి
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్​గా ఉండాలని హెచ్చరిక

నిర్మల్, వెలుగు: కొద్ది రోజులుగా దోబూచులాడిన వాతావరణం ఒక్కసారి మారిపోయి రైతులను కరుణించింది. జిల్లాలో మూడు రోజుల నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు పంటలకు ఊపిరి పోశాయి. ప్రాజెక్టులకు జల కళను తీసుకొచ్చాయి. మొన్నటి వరకు వెలవెలబోయిన కడెం ప్రాజెక్టులోకి క్రమంగా వరద వచ్చి చేరుతోంది. వారం రోజుల క్రితం వరకు వర్షాలు లేక జిల్లాలోని వరి, సోయా తదితర పంటల పరిస్థితి అయోమయంగా మారింది. వర్షం అత్యవసరం అనుకుంటున్న సమయంలో ఒక్కసారి ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు సంబరపడుతున్నారు. ఇక పంటలకు ఢోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడు వెలవెల.. ఇప్పుడు కళకళ

ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో ఎగువ నుంచి వరద పెరిగి జిల్లాలోని కడెం, గడ్డన్న వాగు, స్వర్ణ ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతోంది. దీంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు కింద 68,000 ఎకరాలు, స్వర్ణ ప్రాజెక్టు కింద 10 వేల ఎకరాలు, గడ్డన్న వాగు ప్రాజెక్టు కింద 13 వేల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. అయితే కొద్దిరోజుల క్రితం వరకు కూడా వర్షాలు లేకపోవడంతో పంటల పరిస్థితి ఎలా అని రైతుల ఆందోళన చెందారు. ప్రాజెక్టుల్లో నీరు లేక వెలవెలబోయాయి. 

అయితే ప్రస్తుతం ఏకధాటి వర్షాలతో ఎగువ నుంచి వరద ప్రవాహం పెరగడంతో కడెం ప్రాజెక్టులోకి వరద క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు పరిధిలోని 14 గ్రామాల్లో వరద హెచ్చరికలను సూచించేందుకు ఇప్పటికే అలారాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గడ్డన్న వాగు, స్వర్ణ ప్రాజెక్టులకు మోస్తరు వరద వస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ఈ ప్రాజెక్టుల్లోకి కూడా భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరే అవకాశాలున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

పంటలకు ఊపిరి

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలలు పంటలకు ప్రాణం పోశాయి. నిర్మల్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్​లో 4.30 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. 1.5 లక్షల ఎకరాల్లో పత్తి, లక్షా 20 వేల ఎకరాల్లో వరి, లక్ష ఎకరాల్లో సోయాబీన్, 30 వేల ఎకరాల్లో మొక్క జొన్న, 15 వేల ఎకరాల్లో పసుపు, 15 వేల ఎకరాల్లో వివిధ రకాల పప్పు దినుసు పంటలు సాగు చేస్తున్నారు. అయితే వర్షాలు ఆలస్యంగా కురవడంతో వరి నాట్లలో ఆలస్యం ఏర్పడినప్పటికీ.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు  పంటలన్నిటికీ ఊపిరి పోసినట్లయ్యింది.