
- కర్నాటకలో షా ఏరియల్ సర్వే
- కేరళలో రాహుల్ గాంధీ టూర్
- రిలీఫ్ క్యాంపుల్లో లక్షలాది మంది
దేశంలోని చాలా రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. కర్నాటకలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదివారం ఏరియల్సర్వే చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వాయనాడ్ లోక్‌సభ పరిధిలో రాహుల్‌గాంధీ ఆదివారం పర్యటించారు. వరద బాధితులను పరామర్శించి, నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.
బెంగళూరు: దక్షిణాది రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదలు ముంచెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీలకు చెందిన రెస్క్యూ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. వరదల కారణంగా దేశవ్యాప్తంగా 153 మంది చనిపోయారు. ఒక్క కర్నాటకలోనే 35 మంది చనిపోయారు. మరో 14 మంది వరదనీటిలో గల్లంతయ్యారు. రాష్ట్రంలో 17 జిల్లాల్లో 80 తాలూకాల్లో వరద ప్రభావం ఉందని అధికారులు చెప్పారు. భారీ వర్షాలకు సుమారు వెయ్యి గ్రామాల్లోని 21,431 ఇండ్లు, 4లక్షల16 వేల హెక్టార్లలోని పంటలు నీట మునిగాయని అన్నారు. దాదాపు 6 వేల కోట్ల ఆస్తినష్టం వాటిల్లినట్లు సీఎం యెడియూరప్ప చెప్పారు. తరచుగా కొండచరియలు విరిగిపడుతుండడంతో బెంగళూరు, మంగళూరు నేషనల్హైవే ను అధికారులు క్లోజ్చేశారు. కంప్లి, గంగావతి టౌన్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల నుంచి దాదాపు 3 లక్షల 14 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కర్నాటకలోని బెలగావి, బాగల్కోట్ జిల్లాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, సీఎం యెడియూరప్ప ఏరియల్సర్వే నిర్వహించారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో అమిత్‌షా బెలగావిలోని సాంబ్ర ఎయిర్‌పోర్ట్‌కు మధ్యాహ్నం చేరుకున్నారు. అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్లో ముంపు ప్రాంతాల్లో ఏరియల్సర్వే నిర్వహించారు.
మహారాష్ట్రలో 30 మంది..
ఎడతెగని వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది చనిపోయారు. వరదల ప్రభావం కొల్హాపూర్జిల్లాలో తీవ్రంగా ఉంది. దాదాపు 4 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పశ్చిమ మహారాష్ట్రలో పరిస్థితి చక్కబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆల్మట్టి డ్యాంలో చేరుకుంటున్న వరదను దిగువకు వదిలేస్తున్నట్లు అధికారులు చెప్పారు. 5 లక్షల క్యూసెక్కులను కృష్ణా నదిలోకి విడుదల చేసినట్లు చెప్పారు.
గుజరాత్లో 31 మంది..
రాష్ట్రంలోని సౌరాష్ట్ర, కచ్‌లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 31 మంది చనిపోయారు. అరేబియా సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఐదు మరబోట్లు మునిగి, 20 మంది మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఇందులో ఒక మత్స్యకారుడు ఈదుకుంటూ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో ఐదుగురి మృతదేహాలను అధికారులు గుర్తించారు. మిగతా వారికోసం కోస్ట్‌గార్డ్‌షిప్, హెలికాప్టర్‌తో గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్‌లో 32 మంది..
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మధ్యప్రదేశ్‌లోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలోని 52 జిల్లాల్లో సాధారణంకంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. నర్మద, తపతి, పార్వతి, క్షిప్రా, బల్వంతి తదితర నదుల్లో నీటిప్రవాహం డేంజర్మార్క్కు కాస్త అటూఇటూగా ఉంది. వరదల కారణంగా జరిగిన ప్రమాదాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది మరణించారు.
కేరళలో 68 మంది మృతి
భారీ వర్షాలకు కేరళ వణికిపోతోంది. మూడు రోజుల్లోనే 68 మంది చనిపోగా లక్షా 66 వేల మంది నిరాశ్రయులయ్యారు. వాయనాడ్, మలప్పురం ప్రాంతాల్లో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. కన్నూర్, కాసరగోడ్, వాయనాడ్ లలో రెడ్ రెయిన్ అలర్ట్ప్రకటించారు. ఆరు జిల్లాల్లో ఆరెంజ్అలర్ట్ఇష్యూ చేశారు. వాయనాడ్నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ పర్యటించారు. వరద ప్రాంతాలను, రిలీఫ్ క్యాంపుల్లో బాధితులను కలుసుకున్నారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వారిని ప్రశ్నించారు.