
- ఉప్పొంగిన నదులు..పలు చోట్ల విరిగిపడిన కొండచరియలు
- ఒక్క జిల్లాలోనే 37 మంది మృతి
- 24 మంది గల్లంతు
- రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన
- ఆర్మీ, పోలీసు బలగాలు
ఖాఠ్మండు:
నేపాల్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో నదులు ఉప్పొంగి.. వరదలు బీభత్సం సృష్టించాయి. వర్షాల ధాటికి పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో తీవ్ర ప్రాణనష్టం జరిగింది. గడిచిన 20 రోజుల వ్యవధిలోనే 51 మంది మృతిచెందారని నేపాల్ హోం మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మరో 50 మందికిపైగా గాయపడ్డారని తెలిపింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో కోషి ప్రావిన్స్ ఇలాం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోనే 37 మంది మరణించారని పేర్కొన్నది.
మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నట్టు తెలిపింది. మరో ముగ్గురు చిన్నారులతోపాటు 24 మంది గల్లంతైనట్టు వివరించింది. దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నేపాల్ సైన్యం, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి.. ప్రజలను సేఫ్ ప్లేసులకు తరలించినట్టు తెలిపింది. వరదలతో మొత్తంగా 790 ఇండ్లు నీట మునగగా.. పలు వంతెనలు ధ్వంసమైనట్టు పేర్కొన్నది.
జనజీవనం అస్తవ్యస్తం
రెండురోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ నీటమునిగాయి. రాజధాని ఖాఠ్మండులోనే 226 ఇండ్లు మునిగిపోయాయి. కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొన్నది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయి జనజీవనం అస్యవ్యస్తంగా మారింది. ఇప్పటివరకు రెస్క్యూ బృందాలు వెయ్యి మందికి పైగా ప్రజలను రక్షించారు. శుక్రవారం నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో.. విపత్తు నిర్వహణ అధికారులు ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
నేపాల్‌లోని కోషి, మాధేస్, బాగ్మతి, గండకి, లుంబిని ప్రావిన్సులలో రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. బాగ్‌మతి, తూర్పు రప్తి నదుల చుట్టుపక్కల ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు ప్రమాదకర రోడ్లు, హైవేలపై రాత్రిపూట వెహికల్స్ కదలికను పరిమితం చేశారు. వాతావరణం అనూకులించకపోవడంతో త్రిభువన్ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌నుంచి దేశీయ విమాన సర్వీసుల సేవలను నిలిపేశారు. ఖాఠ్మండు, భరత్‌పూర్, జనక్‌పూర్, భద్రాపూర్, పోఖారా, తుమ్లింగ్‌టార్ నుంచి దేశీయ విమానాలను తదుపరి నోటీసు వచ్చేవరకు
నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
సాయం అందిస్తం: మోదీ
భారీ వర్షాల కారణంగా నేపాల్‌లో జరిగిన ప్రాణ నష్టంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. నేపాల్ప్రజలు, ప్రభుత్వానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఎలాంటి సాయమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మోదీ ట్వీట్‌చేశారు.