
- మహారాష్ట్రలో ఎక్కువగా 674 మంది
దేశంలో రుతుపవనాలు ఈ ఏడాది ఆలస్యంగా మొదలైనా వానలు మాత్రం దంచికొట్టాయి. దేశవ్యాప్తంగా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం రికార్డయింది. కొన్ని రాష్ట్రాల్లోనైతే వానలు బీభత్సం సృష్టించాయి. వరదలు పోటెత్తాయి. ఈ వరదల వల్ల 24 రాష్ట్రాల్లో 2,391 మంది మరణించారు. 15,729 పశువులు చనిపోయాయి. 8 లక్షల ఇండ్లు కూలిపోయాయి. 63 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ ఈ వివరాలు వెల్లడించింది. వరదల వల్ల మధ్యప్రదేశ్‌లో అతి ఎక్కువగా 674 మంది చనిపోయారని ప్రభుత్వం చెప్పింది. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (253), పశ్చిమ బెంగాల్ (227), గుజరాత్ (195), బీహార్ (133), యూపీ (133) ఉన్నాయంది. పశువుల మరణాలు ఎక్కువగా మహారాష్ట్రలో (4,230) రికార్డయ్యాయని వెల్లడించింది. తర్వాత కర్నాటకలో 3,400, మధ్యప్రదేశ్‌లో1,888, కేరళలో 1,183, గుజరాత్‌లో 848 పశువులు మృతిచెందాయంది. అస్సాంలో అతి ఎక్కువగా 1,31,949 ఇండ్లు డ్యామేజ్ అయ్యాయని చెప్పింది. తర్వాత మధ్యప్రదేశ్‌లో 1,18,386, కర్నాటకలో 1,15,792, మహారాష్ట్రలో 1,09,714, పశ్చిమ బెంగాల్‌లో 83,787 ఇండ్లు నాశనమయ్యాయని వివరించింది. రాజస్థాన్‌లో ఎక్కువగా 27.36 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని చెప్పింది. తర్వాత కర్నాటకలో 9.35 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్‌లో 8.88 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్‌లో 6.04 లక్షల హెక్టార్లలో నష్టం జరిగిందని వివరించింది. సెప్టెంబర్‌లో సాధారణం కన్నా 152% ఎక్కువగా వాన పడిందని చెప్పింది.