
హైదరాబాద్, వెలుగు: పైస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ వంటి ప్రొడక్టులు తయారు చేస్తే అగ్రికల్చర్ సైన్సెస్ కంపెనీ ఎఫ్ఎంసీ ఇండియా.. తాజాగా మరో మూడు ప్రొడక్టులను హైదరాబాద్లో లాంచ్ చేసింది. ఇవి భూసారాన్ని, పంట దిగుబడులను పెంచి కీటకాలను నాశనం చేస్తాయని తెలిపింది. ఎఫ్ఎంసి ఇండియా ప్రెసిడెంట్ అన్నవరపు రవి మాట్లాడుతూ తాల్స్టార్ ప్లస్, కాజ్బో, పెట్రా ప్రొడక్టులను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. ప్లస్ కీటకనాశిని తాల్స్టార్ .. వేరుశెనగ, పత్తి, చెరకు పంటల్లోని కీటకాలను చంపుతుంది. పెట్రా బయోసొల్యూషన్ భూసారాన్ని పెంచుతుంది. ఇది నేలలో వేసిన భాస్వరాన్ని పంటలకు అందిస్తుంది. పెట్రా వాడటం సులభమని, ఎక్కువ పంటలకు అనుకూలమని రవి చెప్పారు.
క్రాప్ న్యూట్రిషన్ (పంట పోషకం) అయిన కాజ్బో.. క్యాల్షియం, జింక్, బోరాన్ వంటి మూలకాలను అందిస్తుంది. అత్యధిక పంటల్లో పలు లోపాలను సరిచేస్తుంది. ఇదిలా ఉంటే, రైతులకు మెరుగైన సాగుపద్ధతులను నేర్పించడానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (హైదరాబాద్) తో కలిసి పనిచేస్తున్నామని ఎఫ్ఎంసీ తెలిపింది. దేశంలో 57 కు పైగా రివర్స్ ఆస్మోసిస్ నీటి శుద్ధి ప్లాంటులను నెలకొల్పి లక్ష కంటే ఎక్కువ రైతు కుటుంబాలకు శుద్ధినీటిని అందిస్తున్నామని రవి చెప్పారు. తెలంగాణలో తమకు మూడు వేల మంది డీలర్లు ఉన్నారని చెప్పారు. ఇండియాలో ఏటా 39 శాతం గ్రోత్రేటుతో ఎదుగుతున్నామని, మొత్తం 40 ప్రొడక్టులను అమ్ముతున్నామని వివరించారు.