రూరల్​ డిమాండ్​కు ఢోకా లేదు

రూరల్​ డిమాండ్​కు ఢోకా లేదు
  • ఎల్​ నినో ఎఫెక్ట్​ అంతంత మాత్రమే
  • డైరెక్ట్​ డిస్ట్రిబ్యూషన్​ను పెంచుతున్న కంపెనీలు
  • చిన్న గ్రామాలపై ఎక్కువ ఫోకస్​
  • గ్రామస్థాయి ఎంట్రప్రెనూర్ల నియామకం

న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో వస్తువులకు గిరాకీ (రూరల్​డిమాండ్​) బాగుందని, ఇక నుంచి కూడా తగ్గే అవకాశం లేదని ఫాస్ట్​ మూవింగ్ ​కన్జూమర్​ గూడ్స్​ (ఎఫ్​ఎంసీజీ) కంపెనీలు చెబుతున్నాయి. డిమాండ్​ఎల్​నినోపై ఆధారపడి ఉండదని, ఇన్​ఫ్లేషన్​ (ధరల భారం) తగ్గుదల, ప్రభుత్వం సాగురంగానికి ఇచ్చే నిధులు, డైరెక్ట్​  డిస్ట్రిబ్యూషన్​ వంటివి ముఖ్యమని అంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఎల్​నినోతో వచ్చిన ముప్పేమీ లేదని, రూరల్​ డిమాండ్ ​ పుంజుకుందని డాబర్​ ఇండియా సీఈఓ మోహిత్​ మల్హోత్రా చెప్పారు. ఇన్​ఫ్లేషన్​ తగ్గుముఖం పడుతోంది కాబట్టి రాబోయే నెలల్లో డిమాండ్​ మరింత పెరుగుతుందన్నది తమ అంచనా అని వివరించారు. పసిఫిక్​ ప్రాంతంలో ఏడేళ్ల తరువాత ఎల్​నినో విస్తరిస్తోంది. దీనివల్ల ఈసారి వర్షాలు తక్కువగా పడతాయనే భయాలు నెలకొన్నాయి. సముద్రాల ఉపరితల నీరు అసాధారణంగా వేడి కావడాన్ని ఎల్​నినో అంటారు. దీనివల్ల వర్షపాతం తగ్గుతుంది.

ఆరు క్వార్టర్లలో తగ్గుదల తర్వాత జనవరి–-మార్చి క్వార్టర్​లో రూరల్​ డిమాండ్​ మెరుగుపడింది. ఇక నుంచి ఎల్ నినో ప్రభావం చూపుతుందని కొందరు ఎనలిస్టులు ఆందోళన ప్రకటించారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో రుతుపవనాల రాక నెమ్మదించింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల డిమాండ్‌‌‌‌‌‌‌‌పై ప్రభావం చూపుతుందని బీఎన్​పీ పరిబాస్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ వాదనతో ఎఫ్​ఎంసీజీ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌లు ఏకీభవించడం లేదు.  కేవలం ఎల్​నినేయే గాక చాలా అంశాలు డిమాండ్​ను ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. "తక్కువ ఫుడ్​ ఇన్​ఫ్లేషన్​, తక్కువ బేస్, వ్యవసాయానికి ఎక్కువ నిధులు, కనీస మద్దతు ధరలు వంటి అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. ఎల్ నినో ఎఫ్​ఎంసీజీ గ్రామీణ పునరుద్ధరణపై ప్రభావం చూపుతుందని నిర్ధారించడం తొందరపాటు అవుతుంది" అని మరో ఎఫ్​ఎంసీజీ కంపెనీ మారికో మేనేజింగ్ డైరెక్టర్ సౌగతా గుప్తా అన్నారు.  

గ్రామాలు కీలకం

ప్యాకేజ్డ్ గూడ్స్ కంపెనీలకు గ్రామీణ  డిమాండ్‌‌‌‌‌‌‌‌లో పికప్ కీలకం. ఎందుకంటే ఈ సంస్థల అమ్మకాల్లో సగం గ్రామీణ మార్కెట్ల నుంచే ఉంటాయి. డాబర్, పార్లే ప్రొడక్ట్స్,  నెస్లే ఇండియా వంటి కంపెనీలు తమ గ్రామీణ మార్కెట్లను పెంచుకుంటున్నాయి. గ్రామస్థాయి ఎంట్రప్రెనూర్లను నియమిస్తున్నాయి. చాలా గ్రామాలపై ఫోకస్​ చేస్తున్నాయి. విస్తరణ కారణంగా తమ అమ్మకాలు మరింతగా పెరుగుతాయని ఇవి అంటున్నాయి.  "గ్రామీణ మార్కెట్‌‌‌‌‌‌‌‌లలో మా డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్​ కనీసం 10-–15 శాతం పెరిగింది. ఇది ఫలితాలను చూపుతోంది.  

ఎల్ నినో అంశం గురించి చాలా మంది మాట్లాడుతున్నప్పటికీ, డిమాండ్​ ఊపందుకోవడం కొనసాగుతుందనే మేం అనుకుంటున్నాం”అని బిస్కెట్ల తయారీ కంపెనీ పార్లే సీనియర్ ఎగ్జిక్యూటివ్​ మయాంక్ షా అన్నారు. నెస్లే ఇండియా తన డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్​ను 1.5 మిలియన్ అవుట్‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌లకు పెంచడంతో  మొత్తం పంపిణీ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ 5.1 మిలియన్ అవుట్‌‌‌‌‌‌‌‌లెట్‌‌‌‌‌‌‌‌లకు విస్తరించింది.   గ్రామీణ కవరేజీ విస్తరణను మరింత పెంచుతున్నట్టు ఇటీవల ప్రకటించింది. కంపెనీలు తమ ఉత్పత్తులను దళారుల ద్వారా కాకుండా నేరుగా రిటైల్ ఛానెల్‌‌‌‌‌‌‌‌లకు తరలించడాన్ని డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ అని పిలుస్తారు.