సమ్మర్​లో​ స్కిన్​కేర్​

సమ్మర్​లో​ స్కిన్​కేర్​

ఎండల తీవ్రత రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ ఎండల్లో ఎక్కువగా తిరిగితే చర్మం పాడవుతుంది. అలాగని పనులు చేసుకోకుండా ఇంట్లో కూర్చోలేరు. అందుకని ఈ సీజన్​లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అవేంటంటే...

సీజన్​తో సంబంధం లేకుండా చర్మంపై తేమ అనేది చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా ఎండాకాలంలో బాడీ త్వరగా డీహైడ్రేట్​ అవుతుంది. అలాకాకుండా ఉండేందుకు సరిపడా నీళ్లు తాగాలి. దాంతోపాటు పండ్ల రసాలుకూడా  తాగాలి. ఇలాంటి కేర్​ తీసుకుంటేనే చర్మం ఫ్రెష్​గా, హెల్దీగా ఉంటుంది. స్కిన్​ ముడతలు పడకుండా టైట్‌‌గా ఉండాలంటే సంత్రా పండ్ల జ్యూస్ తాగాలి. ఇది కొలాజన్‌‌ను ఉత్పత్తిని పెంచడంలో సాయపడుతుంది. మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను తగ్గించి చర్మం మెరిసేలా చేస్తుంది.

రోజూ బొప్పాయి జ్యూస్ తాగినా, ఒక కప్పు బొప్పాయి ముక్కలు తిన్నా మంచి రిజల్ట్​ ఉంటుంది. బొప్పాయిలో విటమిన్– సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మానికి చాలా హెల్ప్​ చేస్తుంది. దానిమ్మ గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. చర్మంలో పేరుకుపోయిన డెడ్​సెల్స్​ను తొలగిస్తాయి. చర్మాన్ని శుభ్రంచేసి హెల్దీగా కనిపించేలా చేస్తాయి. దానిమ్మ గింజలు తింటే చర్మంపై ఏర్పడే మొటిమలు, మచ్చలు కూడా తగ్గిపోతాయి. రోజూ దానిమ్మ జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వెళ్ళినా లేదా ఇంట్లో ఉన్నా సన్ స్క్రీన్ లోషన్‌‌ వాడాల్సిందే. సన్​స్క్రీన్​ రాయడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలట్​ కిరణాల​ నుంచి చర్మం డ్యామేజ్​ కాకుండా కాపాడుకోవచ్చు.

చర్మం ఆరోగ్యంగా ఉండాలి అంటే విటమిన్– సి, కె అవసరం. విటమిన్– సి ఉన్న ఫుడ్​ తిని, చక్కెర పదార్థాలు తగ్గిస్తే చర్మం మృదువుగా ఉంటుంది. చాలామంది అందంగా కనిపించడానికి రకరకాల బ్రాండ్ మేకప్ ప్రొడక్ట్స్​ వాడుతుంటారు. వాటివల్ల ముఖం మీది చర్మానికి సరిగా గాలి అందదు. గాలి తగలకపోతే చర్మం పొడిబారి పగిలిపోతుంది. అందుకని ఏ ప్రొడక్ట్స్​ వాడినా రాత్రి నిద్ర పోయేముందు నూనెతో ముఖంపైన ఉన్న మేకప్​ ప్రొడక్ట్​ను తీసేసి, శుభ్రంగా ముఖం కడుక్కోవాలి.