జానపద గాయని స్నేహలత కన్నుమూత

జానపద గాయని స్నేహలత కన్నుమూత

తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి మునిమనవరాలు, జానపద గాయని స్నేహలత కన్నుమూశారు.  గతకొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న  ఆమె హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.   స్నేహలత మూడు దశాబ్దాలుగా ఆకాశవాణి, దూరదర్శన్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక వ్యవహారాలశాఖ ద్వారా అనేక ప్రదర్శనలు ఇచ్చారు. అంతేకాకుండా సినిమాల్లో అనేక పాత్రలకు ఆమె డబ్బింగ్ కూడా చెప్పారు. పెళ్లిళ్ల సందర్భంగా పాడుకునే పాటలను వెలుగులోకి తెచ్చి తెలుగువారి పూర్వ వైభవాన్ని ఈ తరానికి పరిచయం చేశారు. 

స్నేహలత  సంగీత దర్శకురాలిగా కూడా సేవలు అందించారు.  ఈమె సంగీత దర్శకత్వంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఉషా ఉతుప్‌, ఎస్పీ శైలజ, వాణీ జయరాం, గీతామాధురి, మాళవిక, నిత్య సంతోషిణి, మల్లికార్జున్‌ వంటి ప్రముఖులు పాడారు. ప్రస్తుతం ఈమె..  తెలంగాణ జానపద కళాకారుల సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్నారు.  ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ సోషియాలజీ  పూర్తి చేశారు.  స్నేహలత మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పలువురు సంతాపం ప్రకటించారు.