
బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫోని తుఫాన్ తీవ్ర పెను తుఫాన్ గా మారుతోంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై కూడా ఉండటంతో.. అధికార యంత్రాంగం శ్రీకాకుళం తీర ప్రాంతంలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మచిలీపట్నంకు ఆగ్నేయంగా 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఫోనీ.. గురువారం ఉదయం నాటికి మరింత తీవ్ర రూపం దాల్చి.. ఉత్తర తూర్పు దిశలో .. ఉత్తరాంధ్ర, ఒడీషా తీర ప్రాంతంవైపుకు దూసుకెళ్లబోతోంది. ఈ సమయంలో గాలుల తీవ్రత మరింత ఉధృతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం నాటికి మధ్య ఒడీషా తీరంలోని పూరి మరియు పారాదీప్ వద్ద తీరాన్ని తాకి బలహీన పడే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో శ్రీకాకుళం ఉత్తర మరియు తీర ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేశారు. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని ఆదేశించారు.