
సాయం చేయాలన్న మనసుండాలే కానీ.. మన స్థాయి చిన్నదా పెద్దదా అనే ఆలోచన రాదు. ఈ యువకుడు చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగమే అయినా.. బిలియన్ డాలర్ల విలువ చేసే మంచి మనసును చాటుకున్నాడు. ఇంతకీ ఏం చేశాడో తెలుసా?
జొమాటోలో పనిచేసే ఈ ఫొటోలోని అబ్బాయి పేరు.. పతిక్రీత్. ఇతడిని అందరూ రోల్ కాకు అని పిలుస్తారు. కోల్‌కతాలో ఉండే రోల్ మూడుచక్రాల బండి మీద తిరుగుతూ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ప్రతిరోజూ జొమాటోలో వచ్చిన ఆర్డర్స్ కస్టమర్లకు డెలివరీ చేస్తూ.. రోజంతా బిజీగా ఉంటాడు. అయితే.. ఉద్యోగం చిన్నదే అయినా.. ఆలోచనలో, సాయం చేసే గుణంలో పెద్ద మనసును చాటుకుంటున్నాడు. మూడు చక్రాల మీద ఆర్డర్లు సప్లై చేస్తూ.. ఆర్డర్ చేసి క్యాన్సిల్ చేసిన ఫుడ్ ఆ చుట్టుపక్కల ఉండే పేద పిల్లలకు, మురికివాడల పిల్లలకు ఉచితంగా ఇస్తున్నాడు.
ఇలాంటి పిల్లల కోసం పతిక్రీత్ మున్సిపాలిటీలో ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. నాలుగేళ్లుగా రోల్ కోల్‌కతాలోని డుమ్ డుమ్ కంటోన్మెంట్ వీధుల్లో ఫుడ్ డెలివరీ బాయ్‌గా చేస్తున్నాడు. ఒకరోజు ఓ అబ్బాయి పతిక్రీత్ దగ్గరికి వచ్చి కాళ్ల మీద పడి ‘అన్నా.. ఆకలేస్తుంది. ఏమైనా పెట్టవా’ అని అడిగాడు. ఆ కుర్రాడిని పరీక్షగా చూసిన తర్వాత పతిక్రీత్కి ఒక విషయం అర్థమైంది. ఆ కుర్రాడు డ్రగ్స్‌కి అలవాటు పడ్డాడు. డబ్బులిస్తే డ్రగ్స్ కొనుక్కుంటాడని ఆలోచించాడు. ఇంత చిన్న వయసులో డ్రగ్స్‌కి అలవాటు పడ్డ వాడి మీద కోపమొచ్చింది పతిక్రీత్కి. చెంప మీద బలంగా కొట్టాడు. ఆ కుర్రాడు ఏడుస్తుంటే.. పతిక్రీత్ చాలా బాధపడ్డాడు. అక్కడ మొదలైంది.. పతిక్రీత్ మనసులో కదలిక. అప్పటి నుంచి అలాంటి పిల్లలు ఎక్కడ కనిపించినా.. వాళ్లు తిన్నారో లేదో.. కనుక్కొని వారికి ఫుడ్ అందిస్తున్నాడు. తనుండే ప్రాంతానికి దగ్గరలో ఉండే పిల్లలకు చదువు చెప్పిస్తున్నాడు. మురికివాడల్లో పెరిగి, జూదం, భిక్షాటనకు అలవాటు పడ్డ పిల్లలను సరైన దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. చెడు అలవాట్లు మాన్పించి, దొంగతనాలు, డ్రగ్స్ రాకెట్లో చిక్కుకోకుండా వాళ్లకి ఉపాధి మార్గం చూపిస్తున్నాడు.
మున్సిపాలిటీలో ఉద్యోగం చేస్తూ ఇదంతా చేయడం కష్టమనిపించింది. అందుకే చేస్తున్న మున్సిపాలిటీ ఉద్యోగాన్ని మానేసి జొమాటోలో చేరాడు. ఆర్డర్లు లేనప్పుడు పిల్లలతో గడుపుతుంటాడు. ఆర్డర్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లేటప్పుడు అతడి కళ్లు అడ్రస్‌ను గురించి వెతకవు.. రోడ్డుపక్కన ఎవరైనా వీధిబాలలున్నారేమో అని వెతుకుతాయి. అలా కనిపించిన వారికి ఆర్డర్ క్యాన్సిల్ అయిన్ ఫుడ్‌ని ఇచ్చేస్తాడు. ఇలా ఇచ్చేందుకు గానూ.. హోటల్ యజమాన్యాలతో ఒప్పందం కూడా చేసుకున్నాడు పతిక్రీత్. ఒకరు క్యాన్సిల్ చేసుకున్న ఆహారాన్ని మరొకరి కడుపు నింపడానికి ప్లాన్ చేసిన పతిక్రీత్ ఆలోచన బాగుంది కదా!