మహబూబ్నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబ్నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మరికల్​, వెలుగు: మండలంలోని మాద్వార్​ రెండో అంగన్వాడీ చిన్నారులకు మాడిన బువ్వ పెడుతున్నారంటూ గురువారం ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్థులు ఆందోళన చేశారు. సర్పంచి పుణ్యశీల, ఎంపీటీసీ ఆంజనేయులు వచ్చి అంగన్వాడీ సెంటర్​ ను పరిశీలించారు. ఇలాంటి అన్నం ఎందుకు పెడుతున్నారని టీచర్​ను, ఆయాను ప్రశ్నించారు. బాలింతలకు, గర్భిణులకు ఇచ్చే సరుకులు సైతం సక్రమంగా ఇవ్వరని,  ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. సూపర్​వైజర్​ అమ్మక్క మాట్లాడుతూ గ్రామస్థులు ఫిర్యాదు పై సీడీపీవోకు చెప్పానని, సోమవారం  విచారణ జరుపుతామని వివరించారు. 

పనులు చేసినా బిల్లులు వస్తలే..

  • మీటింగ్​లో సర్పంచుల ఆందోళన

రాజాపూర్​, వెలుగు: చేసిన పనులకు బిల్లులు రావడం లేదని, పనులకు కోసం చేసిన అప్పులకు మిత్తీలు కట్టలేక పోతున్నామని సర్పంచులు ఆందోళన చేశారు.మహబూబ్​నగర్​ జిల్లా రాజాపూర్​ మండల పరిషత్​ ఆఫీసులో గురువారం మండల సభ నిర్వహించారు. సభ ప్రారంభానికి ముందే సర్పంచ్​లు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ విద్యుత్​ శాఖ ఆఫీసర్లు సర్పంచులను చులకనగా చూస్తున్నారని, ఈ పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ వాటర్ ట్యాకర్ ఉందని, రాయపల్లి గ్రామానికి ఇప్పటి వరకు ట్యాంక్​ లేదని అన్నారు. పనులు చేసి నెలలు అవుతున్నా.. ఇంత వరకు బిల్లులు చేయడం లేదని వాపోయారు. ఇందుకు నిరసనగా ఎంపీపీ, డీసీఎంఎస్ చైర్మన్ ముందు బైఠాయించారు. ఎంపీడీవో లక్ష్మీదేవి జోక్యం చేసుకొని బిల్లుల విషయాన్ని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో సభ్యులు ఆందోళన విమరించారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్ రెడ్డ్, వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్​ రాంబాయి పాల్గొన్నారు.

 టైమ్​కు బస్సులు లేవని  విద్యార్థుల ధర్నా

కేటిదొడ్డి, వెలుగు: కాలేజీ టైంకు బస్సు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని  రాయచూర్ గద్వాల రోడ్డుపై  విద్యార్థులు గురువారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎనిమిదిన్నరకు  కాలేజీ ఉన్నదని కానీ, తమకు 10 గంటలకు బస్సు వస్తుందని తెలిపారు. కాలేజీకి వెళ్లే సరికి 11 గంటలు దాటుతోందని ఆవేదన చెందారు. ఇదివరకే ఆర్టీసీ ఆఫీసర్లకు చెప్పినప్పటికీ వారు స్పందించడం లేదని వాపోయారు.  సకాలంలో బస్సులు నడుపుతామని ఆఫీసర్లు ఫోన్లో హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.