
- ఫుడ్ లైసెన్స్ లకు అప్రూవల్ ఇవ్వట్లే
- ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసి నెలలు గడుస్తున్నా లైసెన్స్ లు రావట్లే
- మూడు నెలల క్రితం వరకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు అప్రూవల్ బాధ్యతలు
- ఏప్రిల్ 3 నుంచి జోనల్ కమిషనర్లకు..
- అప్పటి నుంచి ఇదే పరిస్థితి
- గ్రేటర్ లో దాదాపు 1,300 అప్లికేషన్లు పెండింగ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ లో ఫుడ్ లైసెన్స్ ల కోసం అప్లయ్ చేసుకున్న వారికి అప్రూవల్ రావడం లేదు. రెండు, మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి ఉంది. మూడు నెలల క్రితం వరకు ఫుడ్ లైసెన్స్ ల బాధ్యత డిజిగ్నేటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చూసేది. అప్పట్లో అప్లయ్ చేసి 10 రోజుల్లోపు అన్ని సరిగ్గా ఉంటే అప్రూవల్ ఇచ్చేవారు.
సరైన పత్రాలు లేకపోతే రిజెక్ట్ చేసేవారు. అయితే మూడు నెలల కింద ఈ బాధ్యతలను వీరి నుంచి తొలగించి జోనల్ కమిషనర్లకు అప్పగించారు. అప్పటి నుంచి జోనల్ కమిషనర్లు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ల కోసం వచ్చి దరఖాస్తులను పరిశీలించకపోవడంతో అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. మూడునెలలుగా దాదాపు 1300 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల లైసెన్స్ ల కోసం దరఖాస్తులు చేసుకున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. పెండింగ్ దరఖాస్తులపై ఇటీవల కమిషనర్ సైతం ఆరా తీసినట్లు తెలిసింది.
లైసెన్స్ ల కోసం మేళాలు..
ఫుడ్ లైసెన్స్ ల కోసం అప్లికేషన్లు ఒక్కసారిగా వస్తుండటంతో వారం క్రితం ఖైతరాబాద్, సికింద్రాబాద్ జోనల్ ఆఫీసుల్లో లైసెన్స్ మేళాలు నిర్వహించారు. ఈ మేళాల్లోనూ వందలాది మంది అప్లయ్ చేసుకున్నారు. అయితే వీటికి సంబంధించిన దరఖాస్తులకు అప్రూవల్ రాలేదు. లైసెన్స్ మేళాలో అధికారులు నేరుగా దరఖాస్తులను పరిశీలించి తీసుకున్న కూడా అప్రూవల్ ఇవ్వకపోవడంపై దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి మేళాలు నిర్వహించిన సమయంలో వచ్చిన వాటికైనా వెంటనే అప్రూవల్ ఇస్తే ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఈ మేళాలో సంబంధిత అన్ని పత్రాలు సరిగా ఉంటేనే దరఖాస్తులు స్వీకరిస్తారు.
గ్రేటర్ లో 67 వేల లైసెన్స్ లు..
గ్రేటర్ లో మొత్తం 67,650 ఫుడ్ లైసెన్స్ లు ఇప్పటికే జారీ అయ్యాయి. ఈ లైసెన్స్ ల్లో రెండు రకాలుగా ఉంటాయి. చిన్న తరహా ఫుడ్ వ్యాపారులకు రూ.200 ఫీజుతో జారీ చేస్తారు. ఈ దరఖాస్తులను పరిశీలించే బాధ్యత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఉంది. వీటి విషయంలో ఇబ్బందులు రావడం లేదు. వెంటనే జారీ అవుతున్నాయి. ఇటువంటివి ప్రస్తుతం గ్రేటర్ లో 48,701 ఉన్నాయి. అయితే పెద్ద పెద్ద హోటల్స్, ఫుడ్ వ్యాపారం చేసే వాటికి రూ.2 వేల ఫీజుతో జారీ చేస్తారు. వీటి బాధ్యతలను జోల్ కమిషనర్లకు అప్పగించారు. వీటి విషయంలో ప్రస్తుతం ఆలస్యం అవుతోంది. ఈ లైసెన్స్ లు గ్రేటర్ లో ఇప్పటి వరకు 18,949 ఉన్నాయి.
లైసెన్స్ లు లేక ఇబ్బందులు..
ఫుడ్ లైసెన్స్ లు జారీ కాకపోవడంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఫుడ్ వ్యాపారం చేసుకునే వారికి ఈ లైసెన్స్ ఉంటేనే ఆన్ లైన్ డెలివరీ సంస్థలు ఫుడ్ డెలిరీకి ఒప్పుకుంటాయి. దీంతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు నిర్వహించిన సమయంలో ఫుడ్ లైసెన్స్ లేకపోతే సదరు ఫుడ్ వ్యాపారాన్ని పూర్తిగా సీజ్ చేస్తున్నారు. ఎంతో అవసరమైన ఫుడ్ లైసెన్స్ లను జారీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.