వంటకు సెలవు : ఆన్‌లైన్ యాప్‌లోనే ఫుడ్ ఆర్డర్లు

వంటకు సెలవు : ఆన్‌లైన్ యాప్‌లోనే ఫుడ్ ఆర్డర్లు

వేలాది మందికి ఉపాధి

ఒక్కక్లిక్ తో కోరుకున్న ఫుడ్ ఇంటికే

పార్టీలు, ఫంక్షన్లకు కూడా

ఉద్యోగులు, బ్యాచిలర్లకు సమయం ఆదా

మహేశ్ ​హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. బ్యాచిలర్​ కావడంతో ఆఫీసు నుంచి ఇంటికొచ్చి వంట చేసుకునే ఓపికలేక అలాగే పడుకున్నాడు. మధ్యాహ్నం అనగా తిన్న తిండి.. రాత్రయ్యేసరికి కడుపులో ఎలుకలు పరుగెడుతున్న ఫీలింగ్. ఏదైనా తిందామంటే రూంలో ఏమీ లేదు. ఆకలి తీరాలంటే ఏదైనా తినాల్సిందే అని మొబైల్​లో ఆఫర్లు చూస్తే అన్ని పోనూ రూ.50కే బిర్యానీ వస్తోంది. ఆర్డర్​పెట్టిన 20 నిమిషాల్లో నోరూరించే బిర్యానీ రూంకే వచ్చేసింది.

మణికొండలో ఉంటున్న సుమ, రాకేశ్​ భార్యాభర్తలు. ఓ సాఫ్ట్​వేర్​ కంపెనీలో ఇద్దరూ ఉద్యోగం చేస్తారు. డ్యూటీ ముగిసేసరికి రోజూ మిడ్​నైట్​ అవుతోంది. అలసిపోయి ఇంటికొచ్చి వంటచేసే ఓపిక లేకపోవడంతో ఆన్​లైన్​లోనే ఫుడ్​ ఆర్డర్​ చేశారు. వాళ్లు ఫ్రెషప్‌ అయ్యేసరికి డెలివరీ బాయ్ ఇంటికే ఫుడ్​ తెచ్చాడు. టీవీ చూస్తూ డిన్నర్ ముగించేశారు.

హైదరాబాద్, వెలుగు:

సిటీ జనం వంటచేసే పని మెల్లమెల్లగా తప్పించుకుంటున్నారు. ‘నో కుకింగ్​డేస్’​పేరిట పలు ఫుడ్​డెలివరీ సంస్థలు ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఆన్​లైన్​ యాప్స్​అందుబాటులోకి రావడంతో సిటీ జనానికి వంట తిప్పలు తప్పుతోంది. ఆర్డర్​పెట్టిన అరగంట లోపే ఫుడ్​ఇంటికే వస్తోంది. దానికితోడు పలు సంస్థలు ఇచ్చే రాయితీతో తక్కువ ధరకే మంచి భోజనం లభిస్తోంది. దీంతో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్లకు రోజు రోజుకూ గిరాకీ పెరుగుతోంది. గతంలో బ్యాచిలర్లు, వంట చేసుకోవటం వీలు కాని వారు హోటల్ కు వెళ్లి పార్సిల్ తెచ్చుకునే వారు. లేకపోతే రైస్​ వండుకుని కర్రీ పాయింట్​కెళ్లి కూరలు తెచ్చుకునేవారు. ప్రస్తుతం ఆన్ లైన్ ఫుడ్ డెలవరీ ట్రెండ్ రావడంతో ఫ్యామిలీస్, ఉద్యోగులు, విద్యార్థులు, బ్యాచిలర్లు ఇలా అన్నివర్గాల ప్రజలు ఆన్ లైన్ ఫుడ్ డెలవరీపై ఆసక్తి చూపుతున్నారు. రోజు ఒకే రకం ఫుడ్ కాకుండా పలురకాల వెరైటీలను ట్రై చేస్తున్నారు. వంటకు కేటాయించాల్సిన సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుండడంతో సిటీ జనాలు ఆన్ లైన్ ఫుడ్ డెలవరీపైనే ఆసక్తి చూపుతున్నారు.

కాకా హోటల్​నుంచి కార్పొరేట్ దాకా

ఆన్ లైన్ లో ఫుడ్ డెలవరీ అంటే చాలా ఎక్కువగా ఆర్డర్ చేయాలేమో అని కొంతమంది భావిస్తారు. కొన్ని పెద్ద హోటళ్లు రెస్టారెంట్ల నుంచి మాత్రమే ఫుడ్ డెలవరీ చేస్తారని అనుకుంటారు. కానీ గల్లీలో ఉండే చిన్న హోటల్ నుంచి బడా రెస్టారెంట్ దాకా అన్ని హోటళ్ల మెనూలు ఆన్ లైన్ లోనే చెక్ చేసుకోవచ్చు. జ్యూస్ నుంచి బిర్యానీ వరకు ఏదైనా సరే ఆర్డర్ ఇవ్వొచ్చు. ఒకే హోటల్ నుంచి ఆర్డర్ చేయాల్సిన పని కూడా లేదు. బిర్యానీ ఒక చోట, ఐస్ క్రీం మరోచోట, జ్యూస్ ఇంకో హోటల్ నుంచి ఇలా మనకు కావాల్సిన అన్నిరకాల ఆహార పదార్థాలను వేర్వేరు హోటళ్ల నుంచి తెప్పించుకోవచ్చు. సాధారణంగా మనం రెస్టారెంట్ కు వెళ్తే అక్కడే లభించే పదార్థాలనే తినాల్సి ఉంటుంది. కానీ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీలో మాత్రం కొన్ని వందల హోటళ్ల మెనూలను పరిశీలించి నచ్చినవి తెప్పించుకోవచ్చు. పైగా ధర ఎంత, ఎంత సమయంలో డెలివరీ చేస్తారు అన్నది కూడా ముందే తెలుసుకునే వీలుంటుంది. డెలివరీ బాయ్ ఎక్కడ ఉన్నాడో కూడా జీపీఎస్ ద్వారా ట్రాక్ చేసి తెలుసుకోవచ్చు. ఫుడ్​బాగా లేకపోతే రిటర్న్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దీనికి తోడు ప్రతి ఆర్డర్ పై ఆఫర్లు ఉన్నాయి. ఇన్నీ అనుకూలతలు ఉండటంతో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీకి డిమాండ్ ఉంటోంది.

ఫంక్షన్లు.. పార్టీలకూ

చిన్న చిన్న ఆర్డర్ల నుంచి ఈ ట్రెండ్ పార్టీలు, ఫంక్షన్ల దాకా పాకింది. బర్త్ డే, మ్యారేజ్, ఆఫీస్ అన్యూవల్ డే, ఇళ్లలో చేసుకునే చిన్న పార్టీలకు కూడా నగరంలో చాలామంది ఆన్ లైన్ ఫుడ్ డెలవరీలపైనే ఆధారపడతున్నారు. ఫంక్షన్ల లో వంట కోసమే ఎక్కువ టైం కేటాయించాల్సి ఉంటుంది. పైగా మార్కెట్ కు వెళ్లి అన్ని వస్తువులు కొనుక్కొని రావటమనేది చాలా మంది కష్టంగా భావిస్తుంటారు. వంటకు టైం కేటాయిస్తే అలసిపోవటం ఫంక్షన్లలో సరదాగా గడిపే సమయం ఉండదని పార్టీల్లో ఫుడ్ ను ఆన్ లైన్ ద్వారానే తెప్పించుకుంటున్నారు. దీనివల్ల ఫుడ్​వేస్టేజ్​ను కూడా తగ్గించవచ్చు. ఇక నలుగురు బ్యాచిలర్లు కలిస్తే చాలు ఓ జంబో బిర్యానీకి ఆర్డర్ చేసేస్తున్నారు.
ఆఫీస్ లో నలుగురు ఉద్యోగులు కలిసి పార్టీ చేసుకుందామనుకుంటే తలాకొంచెం డబ్బులు వేసుకొని కావాల్సిన ఫుడ్​ఆర్డర్ ఇస్తున్నారు. ఒక్కో ఆర్డర్ లో ఆన్ లైన్ సంస్థలు 200 రూపాయల వరకు రాయితీ ఇస్తుండటంతో రోజుకో రకం ఆర్డర్ తో బ్యాచిలర్స్​ రూమ్ లో వంటచేసే పని లేకుండా పోయింది.

వేలాది మందికి ఉపాధి

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ఇప్పుడు ఎంతోమందికి ఉపాధినిస్తోంది. హోటల్​నిర్వాహకులకు, వినియోగదారులకే కాకుండా వేలాది మందికి ఉపాధి మార్గమైంది. హైదరాబాద్ లో దాదాపు 10 వేల మంది యువత ఆన్ లైన్ ఫుడ్ డెలీవరీతో ఉపాధి పొందుతున్నారు. కొంతమంది పార్ట్ టైం జాబ్ చేస్తుండగా ఇంకొంత మంది ఫుల్ టైం దీనిపైనే పనిచేస్తున్నారు. ఒక్కొక్కరు నెలకు కనీసం రూ.15 వేల దాకా సంపాదిస్తున్నారు. ఫుడ్​డెలివరీ సిస్టం అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న ఫుడ్ సెంటర్ల నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ల దాకా వారి వ్యాపారం ముూడింతలు పెరిగింది. సాధారణంగా హోటల్ కు వచ్చి తినే వారే కాకుండా ఫుడ్ డెలివరీ ఆర్డర్లు ఇచ్చే వారంతా కొత్త కస్టమర్లే. ఆన్ లైన్ ద్వారా దాదాపు 6 కిలోమీటర్ల దూరం వరకు డెలవరీ సౌకర్యం ఉండటంతో ఆయా హోటళ్లకు ఆ పరిధిలో కస్టమర్లు యాడ్ అవుతున్నారు. సిటీలో రోజూ లక్షల్లో ఫుడ్ ఆర్డర్లు ఉంటున్నాయి. దీంతో చాలా హోటళ్లు ఓన్లీ ఫుడ్ డెలివరీ కోసం ప్రత్యేకంగా కౌంటర్లు పెట్టాయి. రూమ్ రెంట్ లేదు, కరెంట్ బిల్లు, ఇతర మెయింటెనెన్స్ ఖర్చులు లేకుండానే ఈ వ్యాపారం పెరగటంపై హోటల్​యాజమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికోసం కొన్ని హోటళ్లు సొంతంగా డెలివరీ బాయ్స్ ను ఏర్పాటు చేసుకుంటున్నాయి.