సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల అవస్థలు

సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల అవస్థలు

సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థులు పొద్దున తినే బ్రేక్​ఫాస్ట్​లో కప్ప రావడం, నిద్రపోతున్న స్టూడెంట్లను ఎలుకలు కరిచాయి. సంక్షేమ హాస్టళ్ల దుస్థితిని తెలిపే ఇలాంటి ఘటనలు రోజుకొకటి రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట బయటకు వస్తూనే ఉన్నాయి. సర్కారు నిర్లక్ష్యం వల్ల సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ, గురుకుల, మైనారిటీ వసతి గృహాలన్నిటిలోనూ ఇబ్బందులు ఉన్నాయి. స్వరాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్య దొరుకుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ప్రభుత్వ అధీనంలోని హాస్టళ్లలో నాణ్యమైన భోజనం, కనీస సౌలత్​లు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం, కేటాయించినా విడుదల చేయకపోవడం లాంటి సమస్యలతో హాస్టళ్ల నిర్వహణ గాడితప్పింది. ఇప్పటికీ చాలా సంక్షేమ హాస్టళ్లు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రభుత్వం వాటికి లక్షల్లో అద్దె చెల్లిస్తోంది తప్ప సొంత భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టడం లేదు. హైదరాబాద్ మహా నగరంలో సరూర్ నగర్ తదితర అనేక ప్రాంతాల్లో అపార్ట్​మెంట్ లలో గురుకులాలు నిర్వహిస్తున్నారు. అద్దె చెల్లింపుల్లోనూ ఎలాంటి నియమ నిబంధనలు లేకపోవడంతో అక్రమాలు జరుగుతున్నాయి.
 
ఫుడ్​పాయిజన్​ ఘటనలు
అధికారుల పర్యవేక్షణ లోపించడం, సిబ్బంది తప్పిదాలతో ఏడాది కాలంగా వసతి గృహాల్లో తరచూ ఫుడ్​ పాయిజన్ అవుతోంది. నాణ్యత లేని, గడువు ముగిసిన సరుకులతో తయారు చేస్తున్న ఆహారం తిని నిత్యం పదుల సంఖ్యలో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ వసతి గృహాలతో పాటు, మధ్యాహ్న భోజనంకు సన్నబియ్యం అందిస్తామని గతంలో ప్రభుత్వ పెద్దలు ప్రకటించినా.. అది అమలు కావడం లేదు. అన్నంలో పురుగులు వస్తున్నాయని, ముక్కిన బియ్యం వండుతున్నారని విద్యార్థులు పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఆదిలాబాద్, సిద్దిపేట, వరంగల్, నిర్మల్, గద్వాల సహా పలు జిల్లాల్లో కలుషిత నీరు తాగలేమని, పురుగుల అన్నం తినలేమని స్టూడెంట్లు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపారు. ఇటీవల గౌలిదొడ్డి గురుకుల వసతి గృహంలో విద్యార్థి ఆత్మహత్య, ఫుడ్​ బాగుండటం లేదని బాసర ట్రిపుల్​ఐటీ స్టూడెంట్​ఒకరు కూడా గతంలో ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ కిచెన్ లో పాము కాటుతో ఓ వ్యక్తి మృతి చెందడం.. ఇలా సంక్షేమ వసతి గృహాలు సమస్యల విష వలయంలో కూరుకుపోయాయి. ఇప్పటివరకు గురుకులాలపైన తల్లిదండ్రులకు ఉన్న సానుకూల దృక్పథం ప్రతికూలతగా మారే పరిస్థితి వచ్చింది. 

భోజన చార్జీలు పెంచితేనే..
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2500 గురుకుల సంక్షేమ వసతి గృహాలు ఉండగా వాటిల్లో 5 లక్షల మంది విద్యార్థులు ఉంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పేద విద్యార్థులు భాగమై ఉన్న సంక్షేమ హాస్టళ్లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సమంజసంగా లేదు. వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు, విద్యార్థుల ఇబ్బందులు తెలుసుకునేందుకు ఏబీవీపీ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు వసతి గృహాల్లో సిబ్బంది కొరత, అధికారుల పర్యవేక్షణ లోపం, శిథిలావస్థలో భవనాలు దర్శనమిచ్చాయి. చాలా చోట్ల క్లాసురూములకు, పడుకోవడానికి, పెట్టెలు, పుస్తకాలకు పెట్టుకునేందుకు ఇలా అన్నింటికీ ఒకే గది ఉంది. అకడమిక్ తో పాటు అడ్మినిస్ట్రేషన్, హాస్టల్ సిబ్బందిగా టీచర్లే ఉంటున్నారు. ఆహారం వండి వడ్డించేందుకు సిబ్బంది లేకపోవడంతో టీచర్లే  హాస్టల్, వసతి ఇతరత్రా పనులన్నీ పర్యవేక్షించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం ఒక విద్యార్థికి ఇచ్చే 30 రూపాయలలో గ్యాస్ ఖరీదు సహా మ్యాన్ పవర్ కోసం 8 రూపాయలు వెచ్చిస్తుండగా మిగిలిన 22 రూపాయలతో  అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనంతో పాటు రెండు సార్లు టీ, సాయంత్రం స్నాక్స్ తో, వారానికి రెండు సార్లు నాన్ వెజ్, 5 రోజుల పాటు ఎగ్ తో కూడిన మెనూ పెట్టాల్సి ఉంది. ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు చెల్లింపులతో అది సాధ్యపడకపోవడంతో నాణ్యమైన భోజనం అందడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలి.
- ప్రవీణ్​ రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి