Food Special : దసరా పండక్కి తియ్యని వేడుక చేసుకుందామా..

Food Special : దసరా పండక్కి తియ్యని వేడుక చేసుకుందామా..

దసరా అంటే పూజలు, టపాసుల మోతలే కాదు.. నోరూరించే స్వీట్లు కూడా. ఈ పండుగని దూద్ పాక్, ఉత్తరాఖండ్ ఫేమస్ సింగోరి, గులాబీ పువ్వులతో మరింత తియ్యగా మార్చుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం..

సింగోరి

కావాల్సినవి

పచ్చికోవా- ఒక కప్పు చక్కెర - ఒక కప్పు
కొబ్బరి తురుము - ఒక కప్పు
తమలపాకులు- కొన్ని గులాబీ రేకులు- కొన్ని కాజు, బాదం, పిస్తా తరుగు - కొద్దిగా

తయారీ

పాన్ వేడిచేసి పచ్చికోవా వేసి కరిగించాలి. అందులో కొబ్బరి తురుము, చక్కెర, తరిగిన డ్రై ఫ్రూట్స్ ఒకదాని తర్వాత మరొకటి వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గరపడ్డాక స్టవ్ ఆపేసి, చల్లార్చాలి. తమలపాకుల్ని కోన్ లాగా చుట్టుకుని, అందులో కోవా మిశ్రమాన్ని పెట్టి గులాబీ రేకులతో కలిపి తింటే టేస్ట్ అదిరిపోతుంది.

గులాబీ పువ్వులు

కావాల్సినవి

మైదా పిండి - ఒక కప్పు, చక్కెర - ఒక కప్పు యాలకుల పొడి - ఒక టీ స్పూన్ నూనె-డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ

గిన్నెలో మైదా పిండి, చక్కెర వేసి తగినన్ని నీళ్లు పోసి జారుగా కలపాలి. ఆ మిశ్రమాన్ని కొంచెం సేపు నాననివ్వాలి. తర్వాత అందులో యాలకుల పొడి వేసి బాగా కలపాలి. కడాయిలో నూనె వేడి చేసి గులాబీల ఆకారంలో ఉన్న మౌల్డ్స్ అందులో కాసేపు ఉంచి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మౌల్డ్ని మైదా పిండిలో డిప్ చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేస్తే గులాబీ పువ్వులు రెడీ. ఒక వేళ గులాబీ మౌల్డ్స్ లేకపోతే కాస్త మందంగా ఉన్న కారప్పూస మౌల్డ్స్తోనూ వీటిని తయారుచేసుకోవచ్చు.

దూద్ పాక్

కావాల్సినవి

పాలపొడి - ఒక కప్పు
చక్కెర - అర కప్పు నెయ్యి - అర కప్పు
యాలకుల పొడి- చిటికెడు
మైదా- ఒక టీ స్పూన్ బాదం తరుగు - కొద్దిగా బియ్యప్పిండి- రెండు టేబుల్ స్పూన్లు

తయారీ

పాన్లో చక్కెర వేసి, తగినన్ని నీళ్లు పోసి తీగ పాకం పట్టాలి.అందులో పాల పొడి, మైదా, బియ్యప్పిండి, యాలకుల పొడి ఒకదాని తర్వాత మరొకటి వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దికొద్దిగా నెయ్యి వేస్తూ బాగా కలిపి స్టవ్ ఆపాలి. ఆ మిశ్రమం చల్లారాక నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరవాలి.నచ్చిన షేప్ లో కట్ చేసుకుని తరిగిన బాదంతో గార్నిష్ చేసుకుంటే నోరూరించే దూద్ పాక్ రెడీ.

ALSO READ : సెలవుల్లో వెళ్లొద్దామా : చూడముచ్చటైన చింతల మాధర