
- సీక్రెట్ కెమెరా ఫుటేజీని బయటపెట్టిన ఇజ్రాయెల్
- గాజాలోని ఇండోనేషియన్ హాస్పిటల్ పై షెల్లింగ్..
- 12 మంది మృతి చెందారన్న హమాస్
గాజాలోని పెద్దాస్పత్రి ‘అల్ షిఫా’ను తమ కమాండ్ సెంటర్‌గా హమాస్ ఉపయోగిస్తున్నదని ఆరోపిస్తున్న ఇజ్రాయెల్.. ఇందుకు ఆధారాలను తాజాగా బయటపెట్టింది. హాస్పిటల్ సీక్రెట్ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను రిలీజ్ చేసింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ నుంచి కిడ్నాప్ చేసిన ఇజ్రాయెలీలు, ఇతర విదేశీయులను ఆస్పత్రి లోకి తీసుకొచ్చారని చెప్పింది. అత్యాధునిక గన్నులు చేతబట్టిన పలువురు మిలిటెంట్లు ఒకరిని తీసుకురావడం, తనను తీసుకెళ్తున్న మిలిటెంట్లతో ఇంకొకరు ప్రతిఘటించడం ఆ వీడియోలో కనిపించింది.
‘‘ఇజ్రాయెల్‌పై దాడి జరిగిన అక్టోబర్ 7 నాటి ఫుటేజీ ఇది. ఉదయం 10.42 నుంచి 11.01 గంటల మధ్య నేపాల్, థాయిల్యాండ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను ఇజ్రాయెల్ భూభాగం నుంచి హమాస్ టెర్రరిస్టులు ఎత్తుకెళ్లారు. షిఫా ఆస్పత్రి కాంప్లెక్స్‌ను తమ టెర్రర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా హమాస్ టెర్రరిస్టు సంస్థ మార్చుకుందని ఈ ఘటన నిరూపిస్తున్నది” అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) ట్వీట్ చేసింది. ఆ ఇద్దరు బందీలు ఎక్కడ ఉన్నారో ఇంకా తెలియరాలేదని ఐడీఎఫ్ స్పోక్స్‌పర్సన్ డేనియల్ హగరి చెప్పారు. అంతకుముందు అదే ఆస్పత్రి లో 55 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో కూడిన టన్నెల్ వీడియోను ఇజ్రాయెల్ మిలిటరీ రిలీజ్ చేసింది. ఇందులో గన్నులతో కాల్పులు జరిపేందుకు కొన్ని రంధ్రాలు ఏర్పాటు చేశారని తెలిపింది. బ్లాస్ట్ ప్రూఫ్ డోర్ కూడా ఉందని చెప్పింది.
ఆస్పత్రి వద్ద హెవీ ఫైరింగ్
గాజాలోని మరో ఆస్పత్రి వద్ద హెవీ ఫైరింగ్ చోటుచేసుకుంది. ఇండోనేషియన్ ఆస్పత్రి సెకండ్ ఫ్లోర్‌పై సోమవారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) షెల్లింగ్‌కు దిగడంతో 12 మందికి పైగా చనిపోయారని గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. అయితే ఈ దాడిపై ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇండోనేషియన్ ఆస్పత్రి లో కొన్ని వారాలుగా వేలాది మంది పేషెంట్లు, యుద్ధ బాధితులు తలదాచుకుంటున్నారు. ఈ ఆస్పత్రి లో మెడికల్ వర్కర్‌గా పని చేస్తున్న మర్వాన్ అబ్దల్లా ఫోన్‌లో మాట్లాడుతూ.. ‘‘ఆస్పత్రి కి 200 మీటర్ల దూరం నుంచి ఇజ్రాయెల్ ట్యాంకులు ఆపరేట్ అవుతున్నాయి. సమీపంలోని భవనాల పైకప్పులపై ఇజ్రాయెలీ స్నైపర్‌లు ఉంటున్నారు” అని తెలిపాడు.
ఆదివారం రాత్రి నుంచి జరుగుతున్న వైమానిక దాడులు, షెల్లింగ్ నేపథ్యంలో ఆస్పత్రి కి డజన్ల కొద్దీ డెడ్‌బాడీలు వచ్చాయని, గాయపడిన వారు వచ్చారని అబ్దుల్లా తెలిపాడు. ప్రస్తుతం దాడులు జరుగుతున్న ఆ ఆస్పత్రి లో 600 మంది పేషెంట్లు, 200 మంది హెల్త్ కేర్ వర్కర్లు, 2 వేల మంది బాధితులు ఉన్నారని హెల్త్ మినిస్ట్రీ తెలిపింది.