నేషనల్​ హైవేకు భూములిచ్చేది లేదన్న రైతులు

నేషనల్​ హైవేకు భూములిచ్చేది లేదన్న రైతులు

మొగుళ్లపల్లి,వెలుగు: తరతరాలుగా తమకు జీవనాధారమైన భూముల్లో రోడ్డేస్తే ఎట్లా బతకాలని రైతులు వాపోతున్నారు. తమకు న్యాయం జరగకుంటే పొలాల్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. తమనెట్లాగైనా ఆదుకోవాలని జాయింట్​ కలెక్టర్​ స్వర్ణలత కాళ్లమీద పడి వేడుకున్నారు. తమను కాల్చి చంపినా గుంట భూమి కూడా ఇవ్వబోయేది లేదని  తేల్చి చెప్పారు. మంచిర్యాల నుంచి వరంగల్ జిల్లా ఊరుగొండ వరకు ప్రతిపాదించిన నేషనల్ హైవే కింద చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల్లోని పలు గ్రామాల రైతులు భూములు కోల్పోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో మంగళవారం నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ మీటింగ్​లో రైతులు ఆఫీసర్లపై తమ ఆగ్రహాన్ని, ఆవేదనను వెళ్లగక్కారు. లాక్ డౌన్ టైం లో  ఎట్లా సర్వే చేపట్టారని.. తమకు కనీస సమాచారం లేకుండా ఢిల్లీకి రిపోర్టు ఎలా పంపారని వారు ఆఫీసర్లను నిలదీశారు. రైతుల పొట్ట కొట్టి హైవే నిర్మిస్తారా అని ప్రశ్నించారు. ఇంట్లో కూర్చొని దొంగచాటుగా సర్వే రిపోర్ట్ ఇచ్చారన్నారు. టీఆర్​ఎస్​కు చెందిన టేకుమట్ల జడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి మాట్లాడుతుండగా రైతులు నిరసన తెలిపారు. రైతులు  మాట్లాడుతుండగా  పోలీసులు అడ్డుకున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి న్యాయం జరిగేలా చూస్తానని జాయింట్ కలెక్టర్ స్వర్ణలత హామీ ఇచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణకు ముందే పలువురు ప్రజా సంఘాల లీడర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్​కు తరలించారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్, పొల్యూషన్ కంట్రోల్​ బోర్డ్​ ఆఫీసర్లు, తహసీల్దార్లు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. భూపాలపల్లి డీఎస్సీ సంపత్ రావు,చిట్యాల సీఐ పులి వెంకట్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.