నిరంజన్​ రెడ్డి ఫామ్​హౌస్​ కోసం.. రైతుల భూములు గుంజుకుంటున్నరు

నిరంజన్​ రెడ్డి ఫామ్​హౌస్​ కోసం.. రైతుల భూములు గుంజుకుంటున్నరు

వనపర్తి, వెలుగు :  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి  తన ఫామ్​హౌజ్ కు నీళ్ల కోసం చెరువు కట్ట ఎత్తు పెంచి 300 ఎకరాల పేద రైతుల భూములను నీటిలో ముంచుతున్నాడని  బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం బహుజన రాజ్యాధికార యాత్రలో  భాగంగా వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలంలో ఆయన పర్యటించారు. గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో మంత్రి ఫామ్​ హౌజ్ నుంచి  బోటింగ్ చేయడం కోసమే  రైతుల భూములు బలవంతంగా గుంజుకొని చెరువు కట్ట ఎత్తు అమాంతం పెంచుతున్నారని మండిపడ్డారు. 

వ్యతిరేకిస్తున్న  రైతులను మంత్రి పోలీసులతో భయపెడ్తున్నారని ఆరోపించారు. పర్యాటకం పేరుతో  పేద రైతుల భూములను లాక్కోవద్దని  హెచ్చరించారు. హైదరాబాద్​లో రూ.1,400 కోట్లతో కట్టిన సెక్రటేరియెట్​కు  కూడా సీఎం కేసీఆర్ ఎన్నడూ వెళ్లడం లేదని ఆరోపించారు. సెక్రటేరియేట్ కు రాని సీఎంకు నెలకు రూ.3.36 లక్షల జీతం ఎందుకని నిలదీశారు. ప్రజల సొమ్మును దోచుకుంటూ కేసీఆర్ కుటుంబం విలాసవంతమైన జీవితం గడుపుతున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, ఇన్​చార్జులు నాగనమోని చెన్నరాములు,  ఎల్లస్వామి, నాయకులు మిద్దె మహేశ్​, గడ్డం మహేశ్, రంజిత్, రాములు, రాములమ్మ  పాల్గొన్నారు.