పోలింగ్ కు అంతా రెడీ.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

పోలింగ్ కు అంతా రెడీ.. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు
  • ‘పోల్ క్యూ రూట్’ యాప్​తో పోలింగ్ సెంటర్లలో క్యూలైన్​ను తెలుసుకునే అవకాశం

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 5.30 గంటలకే ఎన్నికల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండనున్నారు. ఉదయం 6 గంటల నుంచి 6.15 గంటల మధ్య మాక్ పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు  ముగియనుంది. బుధవారం ఎన్నికల అధికారులు డీఆర్సీ కేంద్రాల ద్వారా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని అందజేశారు. పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది సాయంత్రమే చేరుకున్నారు. సమస్యాత్మక పోలింగ్‌స్టేషన్లలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.  పోలింగ్ కేంద్రాల వద్ద ఎంత  క్యూ లైన్ ఉందో తెలుసుకునేందుకు హైదరాబాద్ జిల్లాలో మొదటి సారిగా స్పెషల్ యాప్​ను ఎన్నికల అధికారులు తీసుకొచ్చారు. ‘పోల్ క్యూ రూట్’  యాప్ ద్వారా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ వివరాలను  తెలుసుకోవచ్చు. జీహెచ్ఎంసీ వెబ్​సైట్, మై జీహెచ్ఎంసీ యాప్​లో ఈ యాప్​ను యాక్టివేట్ చేశారు. ముందుగా జీహెచ్ఎంసీ  వెబ్ సైట్​లోకి వెళ్లిన తర్వాత పోల్ క్యూ లైన్​ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెగ్మెంట్ పేరు, పోలింగ్ స్టేషన్ పేరు నమోదు చేసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో నావిగేషన్ చూపిస్తుంది. ఎంతమంది క్యూలో వేచి ఉన్నారో చూపిస్తుంది. వెయిటింగ్  టైమ్ కూడా మెన్షన్ చేస్తుంది. ఈ క్యూ లైన్​ యాప్​ను సెక్టార్ ఆఫీసర్ అప్ డేట్ చేస్తుంటారు.

 హైదరాబాద్ జిల్లాలో..

హైదరాబాద్ జిల్లాలోని  15 సెగ్మెంట్లలో 1,677 లోకేషన్లలో 4,119 పోలింగ్ స్టేషన్లను  ఏర్పాటు చేశారు. ఎన్నికల బరిలో మొత్తం 312 మంది అభ్యర్థులున్నారు. 45 లక్షల 36 వేల 852 మంది ఓటర్లు ఉండగా,   పురుషులు 23 లక్షల 22 వేల 666 మంది, మహిళలు 22 లక్షల 13 వేల 859 మంది, ట్రాన్స్ జెండర్లు 327 మంది ఉన్నారు.  పోలింగ్ కోసం 9,318 ఈవీఎంలు, 5,132 కంట్రోల్ యూనిట్లు, 5,737  వీవీ ప్యాట్లను వాడుతున్నారు. 1,700  సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నట్లు గుర్తించిన అధికారులు.. అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు.  15 డీఆర్సీ కేంద్రాల ద్వారా పోలింగ్ అధికారులకు పోలింగ్ సామాగ్రిని అందజేశారు. పోలింగ్ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ..  అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్  కాస్టింగ్ చేస్తున్నట్లు అంతే కాకుండా కొన్ని లొకేషన్లలో పోలింగ్ కేంద్రాల చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరిశీలిస్తామన్నారు.  పోలింగ్ అధికారులు, సిబ్బంది కొరత లేదని ఆయన తెలిపారు. అదనంగా 20 శాతం సిబ్బందిని సిద్ధంగా ఉంచినట్లు ఆయన చెప్పారు.  ఓటింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

మేడ్చల్ జిల్లాలో..

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో మొత్తం 5 సెగ్మెంట్లున్నాయి. 126 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.  జిల్లా వ్యాప్తంగా 841 లొకేషన్లలో  2,439 పోలింగ్ స్టేషన్లు ఉండగా వీటిలో అర్బన్ పోలింగ్ స్టేషన్లు 2,280,  రూరల్​లో 159 ఉన్నాయి. 12,510 పోలింగ్ సిబ్బంది పనిచేస్తుండగా..  వీరిలో 2,880 మంది పీవోలు, 2,860  మంది ఏపీవో లు, 6,570 మంది ఓపీవోలు ఉన్నారు. 200 మంది మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు.  సమస్యాత్మకంగా ఉన్న  పోలింగ్ స్టేషన్ల వద్ద లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.  పోలింగ్ కోసం 6,422 బ్యాలెట్ యూనిట్లు, 3,050 కంట్రోల్ యూనిట్లు, 3,373  వీవీ ప్యాట్లను వాడుతున్నారు

రంగారెడ్డి జిల్లాలో..

రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం, ఎల్ బీనగర్,  -మహేశ్వరం, -రాజేంద్ర నగర్,-శేరిలింగంపల్లి, చేవెళ్ల, -కల్వకుర్తి, -షాద్​నగర్ సెగ్మెంట్లున్నాయి. మొత్తం 8 సెగ్మెంట్లలోని1,419 ప్రాంతాల్లో 3,453 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 35 లక్షల 23 వేల 219 మంది ఓటర్లున్నారు. 209 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 283 మంది మైక్రో అబ్జర్వర్లు, 3,803 మంది పీవోలు, 7,606 మంది ఓపీవోలు కలుపుకుని మొత్తం 15,212 మంది పోలింగ్ విధులు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో  భారీ భద్రత ఏర్పాటు చేశారు.  

వికారాబాద్ జిల్లాలో..

వికారాబాద్ జిల్లాలో పరిగి, వికారాబాద్, తాండూర్, కొడంగల్ సెగ్మెంట్లున్నాయి. ఈ 4 సెగ్మెంట్లలో 61 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 634 లోకేషన్లలో 1,133 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 109 లోకేషన్లలో 299 క్రిటికల్  పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సమస్యాత్మకంగా ఉన్న 810 పోలింగ్ స్టేషన్ల వద్ద లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 9 లక్షల 60 వేల 376 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 4 లక్షల 77 వేల  528 మంది, 4 లక్షల 82 వేల 808 మంది మహిళలు,40 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు.