సర్పంచ్ పదవికి వేలం పాట

సర్పంచ్ పదవికి వేలం పాట

గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగడం మనకు తెలిసిందే. గ్రామస్తులంతా ఒక్కటై తమ నాయకుడ్ని ఏకగ్రీవం చేసుకుంటారు. ఇలాంటి ఘటనలు మనం చాలా చోట్ల చూశాం. కానీ ఓ గ్రామ ప్రజలు తమ సర్పంచ్ ను ఎన్నుకునేందుకు మాత్రం వినూత్న పద్ధతికి తెరలేపారు. తమ గ్రామ సర్పంచ్ ను ఎన్నుకొనేందుకు ఆ పదవికి వేలం పాట నిర్వహించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అశోక్ నగర్ జిల్లా భతౌలి గ్రామ పంచాయతీ ప్రజలు సర్పంచ్ పదవికి వేలం పాట ఏర్పాటు చేశారు. ఐదుగురు వ్యక్తులు ఈ వేలం పాటలో పాల్గొన్నారు. చివరకు సౌభాగ్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి వేలం పాటలో గెలిచి పదవిని చేజెక్కించుకున్నాడు. 

రూ.21 లక్షలతో వేలం పాట ప్రారంభం అయ్యింది. చివరకు రూ.44 లక్షలకు సౌభాగ్ సింగ్ సర్పంచ్ పదవి దక్కించుకున్నారు. ఆక్షన్ పూర్తయిన వెంటనే.. సౌభాగ్ సింగ్ ను గ్రామ సర్పంచ్ గా స్థానికులు ప్రకటించారు. ఎన్నికల సమయానికి సౌభాగ్ సింగ్ మొత్తం డబ్బును జమచేయాల్సి ఉంటుంది. ఆయన మాత్రమే ఎన్నికల వేళ నామినేషన్ వేయాలి. గ్రామంలో వేరేవాళ్లు ఎవరో మరో నామినేషన్ దాఖలు చేయకూడదు. ఒకవేళ ఆయన ఏదైనా కారణాలతో డబ్బును సమకూర్చలేకుంటే.. అతని తర్వాత వేలం పాటలో ఎక్కువ పాడిన వ్యక్తిని గ్రామ సర్పంచ్ గా ఎన్నుకుంటామని స్థానికులు చెబుతున్నారు. 

మరోవైపు స్థానిక అధికారులు మత్రం ఇలాంటి ప్రక్రియలో సర్పంచ్ ఎన్నికయినా అతనికి ఎలాంటి గుర్తింపు ఇవ్వలేమన్నారు. సర్పంచ్ ఎన్నికకు ఎన్నికల్లో పోటీ చేసి ఫారం నింపాల్సి ఉంటుంది. సర్పంచ్ పదవికి ఫారం నింపినప్పుడు మాత్రమే వచ్చి అది చెల్లుబాటవుతుందని తెలిపారు. ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు అన్నారు. వేలం పాటలో పాల్గొన్న వ్యక్తి అయనా కావొచ్చని స్థానిక అధికారులు తెలిపారు.