తొలిసారిగా ట్రాన్స్ జెండర్లకు బ్యాంకు లోన్, డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు

తొలిసారిగా ట్రాన్స్ జెండర్లకు బ్యాంకు లోన్, డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు

ట్రాన్స్ జెండర్లు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. ఒకప్పటి మాదిరిగా బిక్షాటన చేయకుండా ఇప్పుడు చాలామంది తమకు నచ్చిన రంగంలో ప్రతిభ కనబరుస్తున్నారు. ఎవరి కాళ్లపై ఆధారపడకుండా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ తామేంటో నిరూపించుకుంటున్నారు. తాజాగా కరీంనగర్ లో ఇద్దరు ట్రాన్స్ జెండర్లకు డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు రుణం మంజూరైంది.

రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు ఆశా అనే ట్రాన్స్ జెండర్ కు రూ.5 లక్షల రుణం మంజూరైంది. కరీంనగర్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆశాకు రూ.5 లక్షల సబ్సిడీ రుణం మంజూరైంది. బ్యాంకు నుంచి వచ్చిన లోన్ తో ప్రస్తుతం ఉన్న తన ఫోటో స్టూడియోను విస్తరించాలని భావిస్తోంది. మంగళవారం(ఈనెల 21న) కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ రూ.5 లక్షల చెక్కును ఆశాకు అందజేశారు. రూ.5లక్షల రుణం ఆశా కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని శాస్త్రినగర్‌కు చెందిన ఆశా.. కరీంనగర్‌కు వలస వచ్చి ఇక్కడే స్థిరపడింది. ఫోటోగ్రఫీపై ఉన్న ఇష్టంతో ఆమె ఫోటోగ్రఫీ రంగాన్ని ఎంచుకుంది. 2017 నుండి ఆదర్శనగర్‌లో ఫోటో స్టూడియోను నడుపుతోంది. పుట్టినరోజు ఫంక్షన్‌లు, ప్రీ-వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్‌లకు వెళ్లి తన కాళ్లపై తాను జీవిస్తూ ట్రాన్స్ జెండర్లకు ఆదర్శంగా నిలుస్తోంది. 

మరోవైపు.. రాష్ట్రంలోనే తొలిసారిగా మరో ట్రాన్స్‌జెండర్ నక్కా సింధుకు ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ను జిల్లా కలెక్టర్ అందించారు.