
- రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఇటీవల సుప్రీం తీర్పు
- రాష్ట్రాలు పంపే బిల్లులపై నిర్ణయానికి టైమ్‌లైన్ పెట్టవచ్చా?
- మొత్తం 14 ప్రశ్నలతో అత్యున్నత న్యాయస్థానానికి 5 పేజీల లేఖ
- రాజ్యాంగంలో ఇలాంటి నిబంధనలేవీ లేవని అందులో ప్రస్తావన
న్యూఢిల్లీ: రాష్ట్రాలు పంపే బిల్లులపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతికి గడువు విధించవచ్చా? అని సుప్రీంకోర్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యాయ సలహా కోరారు. బిల్లుల పరిష్కారానికి సంబంధించి గవర్నర్, రాష్ట్రపతికి ఆర్టికల్ 200, 201 ద్వారా రాజ్యాంగం కల్పించిన అధికారాల్లో ఇలాంటి నిబంధన ఏదీ లేదని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో దీనిపై కోర్టు అభిప్రాయం తెలియజేయాలని కోరారు. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) కింద తనకు ఉన్న విచక్షణాధికారాలను ఉపయోగించి సుప్రీంకోర్టును సంప్రదించారు.
రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి గానీ, గవర్నర్ గానీ మూడు నెలల్లోగా ఆమోదించడమో, లేదా తిప్పి పంపడమో చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపైనే సుప్రీంకోర్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యాయ సలహా కోరారు. దీనిపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. మొత్తం 14 ప్రశ్నలు సంధిస్తూ ఈ నెల 13న సుప్రీంకోర్టుకు 5 పేజీల లేఖ రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200, 201 ద్వారా గవర్నర్, రాష్ట్రపతికి కల్పించిన అధికారాలపై వివరణ కోరారు.
రాష్ట్రాల అసెంబ్లీలు పాస్ చేసి పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి సంబంధించి గవర్నర్‌కు ఉన్న అధికారాలను ఆర్టికల్ 200, రాష్ట్రపతికి ఉన్న అధికారాలను ఆర్టికల్ 201 తెలియజేస్తుంది.
ఇవీ ప్రశ్నలు..
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద ఒక బిల్లును గవర్నర్‌కు పంపినప్పుడు ఆయనకు రాజ్యాంగపరంగా ఉన్న ఆప్షన్స్ ఏంటి?
- బిల్లును గవర్నర్‌కు పంపినప్పుడు ఆయన తనకున్న అన్ని ఆప్షన్స్‌ను వినియోగించుకుంటూ మంత్రిమండలి సహాయం, సలహాలకు కట్టుబడి ఉంటారా?
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణాధికారాన్ని ఉపయోగించడం న్యాయబద్ధమైనదేనా?
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణాధికారాన్ని ఉపయోగించడం న్యాయబద్ధమైనదేనా?
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద గవర్నర్ తీసుకునే చర్యలపై న్యాయ సమీక్షకు వీలు లేకుండా ఆర్టికల్ 361 రక్షణ కల్పిస్తుందా?
- రాజ్యాంగం పరంగా గవర్నర్ అధికారాలకు సంబంధించి ఎలాంటి కాలపరిమితి లేనప్పుడు.. అధికారాల వినియోగం విషయంలో గవర్నర్‌కు కోర్టులు కాలపరిమితి విధించవచ్చా?
- రాజ్యాంగం పరంగా రాష్ట్రపతి అధికారాలకు సంబంధించి ఎలాంటి కాలపరిమితి లేనప్పుడు.. అధికారాల వినియోగం విషయంలో రాష్ట్రపతికి కోర్టులు కాలపరిమితి విధించవచ్చా?
- గవర్నర్ బిల్లు పంపినప్పుడు, రాష్ట్రపతి దానిపై నిర్ణయం తీసుకునే ముందు సుప్రీంకోర్టును సలహా కోరాలా?
- ఒక చట్టం అమల్లోకి రావడానికి ముందు గవర్నర్, రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు న్యాయబద్ధమైనవేనా? ఒక బిల్లు చట్టంగా మారడానికి ముందు అందులోని అంశాలపై కోర్టులు విచారణ చేపట్టవచ్చా?
- ఆర్టికల్ 142 ద్వారా గవర్నర్, రాష్ట్రపతి రాజ్యాంగ అధికారాలను, ఆదేశాలను వేరే ఏ విధంగానైనా భర్తీ చేయవచ్చా?
- గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర అసెంబ్లీ చేసిన చట్టం అమల్లోకి వస్తుందా?
- ఆర్టికల్ 145(3) ప్రకారం.. ఈ కోర్టులోని ఏదైనా బెంచ్ కేసు విచారణ చేపట్టే ముందు అందులోని అంశాలకు రాజ్యాంగ వివరణ అవసరమైతే, దాన్ని ఐదుగురు సభ్యుల బెంచ్‌కు సిఫార్సు చేయడం తప్పనిసరి కాదా?
- ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు జారీ చేయవచ్చా?
- ఆర్టికల్ 131 కింద పిటిషన్ దాఖలైతే తప్ప.. వేరే ఇతర సందర్భాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టుకు రాజ్యాంగం అనుమతిస్తుందా?
సమీక్షకు బదులు సలహా..
బిల్లుల విషయంలో గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్షకు వెళ్లొద్దని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి బదులు రాష్ట్రపతి ద్వారా కోర్టు అభిప్రాయాన్ని కోరింది. ఒకవేళ కేంద్రం రివ్యూ పిటిషన్ వేసి ఉంటే, నిబంధనల ప్రకారం దానిపై ఇంతకుముందు తీర్పు ఇచ్చిన బెంచ్‌నే విచారణ చేపట్టాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రపతి లేవనెత్తిన అంశాలపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రపతి లేవనెత్తిన అంశాల్లో ఏదైనా ప్రశ్నకు గానీ, అన్ని ప్రశ్నలకు గానీ జవాబు ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించవచ్చు.
సుప్రీం ఇచ్చిన తీర్పు ఏంటి?
రాష్ట్రాలు పంపే బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గత నెల 8న సంచలన తీర్పు ఇచ్చింది. తమిళనాడు సర్కార్ వర్సెస్ గవర్నర్ కేసులో విచారణ చేపట్టిన జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌తో కూడిన డివిజన్ బెంచ్.. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని పేర్కొంది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి గానీ, గవర్నర్ గానీ మూడు నెలల్లోగా ఆమోదించడమో, తిప్పి పంపడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు గల కారణాలనూ తెలియజేయాలని చెప్పింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సుప్రీంకోర్టును నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల చర్యలు న్యాయసమీక్ష పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.
ఏంటీ న్యాయ సలహా?
ఏదైనా ముఖ్యమైన అంశంలో న్యాయపరంగా ప్రశ్నలు తలెత్తినప్పుడు రాజ్యాంగం ఆర్టికల్ 143(1) ద్వారా తనకు కల్పించిన అధికారాల ద్వారా సుప్రీంకోర్టును రాష్ట్రపతి న్యాయ సలహా కోరవచ్చు. ఆ అంశం సముచితమైనదని సుప్రీంకోర్టు భావిస్తే, దానిపై విచారణ చేపట్టి రాష్ట్రపతికి నివేదిస్తుంది. లేదంటే విచారణకు నిరాకరిస్తుంది. గతంలో చాలాసార్లు సుప్రీంకోర్టును రాష్ట్రపతి న్యాయ సలహా కోరారు. జమ్మూకాశ్మీర్ పునరావాస చట్టం, కొలీజియం నిర్మాణం, అయోధ్య వివాదం, 2జీ స్పెక్ట్రం తదితర అంశాలపై ఆనాటి రాష్ట్రపతులు న్యాయ సలహా కోరారు.
ఇది న్యాయవ్యవస్థను సవాల్ చేయడమే: స్టాలిన్
సుప్రీంకోర్టు ఇదివరకే ఇచ్చిన తీర్పును మార్చడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి రాసిన లేఖపై ఆయన స్పందించారు. ‘‘కేంద్రం చేసిన ఈ ప్రయత్నంతో బీజేపీకి అనుకూలంగా తమిళనాడు గవర్నర్ వ్యవహరించారని స్పష్టంగా అర్థమవుతున్నది. కేంద్ర ఏజెంట్లుగా పనిచేసే గవర్నర్ల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వాలను ఉంచేందుకే కేంద్రం ఇలా చేస్తున్నది. ఇది న్యాయవ్యవస్థను నేరుగా సవాల్ చేయడమే అవుతుంది” అని ‘ఎక్స్’లో స్టాలిన్ పేర్కొన్నారు. ‘‘బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్‌కు గడువు విధిస్తే అభ్యంతరాలెందుకు? ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలను నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నదా?” అని ఆయన ప్రశ్నించారు.