గోదావరికి పోటెత్తిన వరద

గోదావరికి పోటెత్తిన వరద

భద్రాచలం, వెలుగు : ఈ ఏడాదిలో రెండోసారి భద్రాచలం వద్ద మంళవారం గోదావరికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గత నెలలో 71.3 అడుగుల గరిష్ట నీటిమట్టం నమోదు కాగా, ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తిరిగి గోదావరి ప్రవాహం పెరుగుతోంది. దీంతో భద్రాచలం- –కుక్కునూరు, భద్రాచలం-–పేరూరు, భద్రాచలం–-ఒడిశా, చత్తీస్​గఢ్, ఆంధ్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలోని సున్నంబట్టి, ఎం.కాశీనగరం, గంగోలు, చర్ల మండలంలోని దండుపేట కాలనీ, వీరాపురం, పెద్దిపల్లి, అశ్వాపురం మండలంలోని నెల్లిపాక బంజర, రామచంద్రాపురం, బట్టమల్లయ్య గుంపు, కుమ్మరిగూడెం కింది గుంపు, టేకులగుట్ట, మణుగూరు మండలంలోని చిన్నరాయిగూడెం, కమలాపురం, అన్నారం గ్రామాలకు వరద ముంపు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో గోదావరితో పాటు, వాగులు, ఇతర జలాశయాల్లో ప్రయాణాలను నిషేధించినట్టు కలెక్టర్​అనుదీప్​దురిశెట్టి, ఎస్పీ వినీత్ ​ప్రకటించారు. ఎవరూ వాగులు దాటొద్దని హెచ్చరించారు. రెవెన్యూ, పోలీసులు పహారా కాయాలని ఆదేశించారు. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. మంగళవారం అర్ధరాత్రికి 55 అడుగుల మేర నీటిమట్టం చేరుకుంటుందని సీడబ్ల్యూసీ వెల్లడించింది. సెక్టోరియల్ ఆఫీసర్లు వారికి కేటాయించిన మండలాల్లోకి వెళ్లిపోవాలని కలెక్టర్​ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇంద్రావతి ఉగ్రరూపం

ఏటూరునాగారం : కాళేశ్వరం ప్రాజెక్టుకు దిగువన ఉన్న ఇంద్రావతి నది ఉధృతంగా ప్రవహస్తోంది. దీంతో  ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్​ వద్ద గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. సోమవారం మధ్యాహ్నం 14.830 మీటర్లు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక, మంగళవారం ఉదయం 7 గంటలకు 15.830 మీటర్లకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం నుంచి వరద ప్రవాహం నిలకడగా ఉందని,  మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి ప్రవాహం చేరకపోవచ్చని సీడబ్ల్యూసీ ఆఫీసర్లు చెప్పారు. 

గ్రామాలకు రాకపోకలు బంద్

వెంకటాపురం  : వాజేడు మండలం పేరూరు వద్ద మంగళవారం సాయంత్రానికి గోదావరి 15.380 మీటర్లకు చేరుకొంది. దీంతో వెంకటాపురం, వాజేడు మండలంలో పలు గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. వాజేడు మండలం టేకులగూడెం వద్ద జాతీయ రహదారిపై వరద నీరు చేరుకోవడంతో చత్తీస్​గఢ్​– తెలంగాణ మధ్య రాకపోకలు ఆపేశారు. పలు గ్రామాల సరిహద్దులకు వరద చేరింది. అలాగే భద్రాచలం వెంకటాపురం రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం మండలం సురవెడుకు చెందిన కెక్కెం లక్ష్మణరావు గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు.