ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్‌‌ : అంబానీ 1, అదానీ 2

ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్‌‌ : అంబానీ 1, అదానీ 2

న్యూఢిల్లీ :ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2019 వచ్చేసింది. ఎప్పటి లాగానే బిలీనియర్ ముఖేష్ అంబానీ రిచెస్ట్‌‌ ఇండియన్‌‌గా నిలిచారు. కానీ ఈ సారి లిస్ట్‌‌లో కొందరు తమ సంపదను పెంచుకుని ముందుకెళ్తే.. మరికొందరు మాత్రం తమ సంపదను తగ్గించుకుని వెనుకబడ్డారు. ఎప్పటి మాదిరిగానే ఫస్ట్‌‌ ప్లేస్‌‌లో నిలిచిన ముఖేష్ అంబానీ ఆయన సంపదను ఈ ఏడాది 4.1 బిలియన్ డాలర్లు(రూ.29,103 కోట్లు) పెంచుకున్నారు. మొత్తంగా ఆయన సంపద 51.4 బిలియన్ డాలర్లకు(రూ.3,64,914 కోట్లు) పెరిగింది. ముఖేష్ అంబానీకి జియో కోట్లు కురిపిస్తోంది. మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ టెలికాం యూనిట్ నుంచి ముఖేష్ అంబానీ బాగా సంపద పెంచుకుంటున్నారని ఫోర్బ్స్ లిస్ట్‌‌లో వెల్లడైంది.

ఇక ఈ లిస్ట్‌‌లో రెండో స్థానంలో నిలిచిన గౌతమ్ అదానీ..ఏకంగా ఎనిమిది స్థానాలు జంప్ చేశారు. ఆయన సంపద 15.7 బిలియన్ డాలర్లుగా ఉంది. మూడో స్థానంలో  15.6 బిలియన్ డాలర్లతో హిందూజా బ్రదర్స్​ ఉండగా… 15 బిలియన్ డాలర్లతో పల్లోంజి మిస్త్రీ టాప్ 4లో ఉన్నారు. మొట్టమొదటిసారి ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కొటక్ గతేడాది కంటే ఈ ఏడాది 4 బిలియన్ డాలర్ల సంపదను పెంచుకోవడంతో టాప్ 5లోకి వచ్చేశారు. మొత్తంగా ఆయన సంపద 14.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. కొటక్ మహింద్రా బ్యాంక్ షేర్లు గతేడాది నుంచి 39 శాతం మేర ఎగిశాయి.

మాంద్యం ఎఫెక్ట్.. తరిగిన టైకూన్ల సంపద….

మాంద్యం ఎఫెక్ట్‌‌తో ఎకానమీకి ఛాలెంజింగ్‌‌గా ఈ ఏడాది.. ధనికుల సంపదకు కూడా బొక్కపెట్టింది. 2019 ఫోర్బ్స్ ఇండియా రిచ్‌‌ లిస్ట్‌‌లో ఈ టైకూన్ల సంపద గతేడాది నుంచి8 శాతం తగ్గిపోయి మొత్తంగా 452 బిలియన్ డాలర్లకు(రూ.32,09,539 కోట్లకు) చేరింది.  ఈ లిస్ట్‌‌లో ఉన్న100 మందిలో సగానికి పైగా టైకూన్ల సంపద తగ్గిపోయింది. కొంతమంది టైకూన్లు మాత్రం మాంద్యం ఎపెక్ట్‌‌ ఏమీ లేకుండానే సంపదను భారీగా పెంచేసుకున్నారు. వారిలో ముఖేష్ అంబానీ టాప్‌‌లో ఉన్నారు.

తెలుగు తేజాలు..

తెలుగు రాష్ట్రాల పారిశ్రామికవేత్తలైన దివీస్‌‌ లేబొరేటరీస్‌‌ దివి మురళి, మేఘ ఇంజినీరింగ్‌‌ అండ్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ పీ. పీ. రెడ్డి, అరబిందో ఫార్మా పీ. వీ. రామ్‌‌ప్రసాద్‌‌ రెడ్డి, డాక్టర్‌‌ రెడ్డీస్‌‌ లేబొరేటరీస్‌‌ కే. సతీష్‌‌ రెడ్డిలు  ఈ ఫోర్బ్స్‌‌ రిచ్‌‌ లిస్ట్‌‌లో తొలి వంద మందిలో ప్లేస్‌‌ పొందారు.

ప్రేమ్‌‌జీ ప్లేస్​ 17

వెనుకబడ్డ వారిలో విప్రో ఫౌండర్ అజిమ్‌‌ ప్రేమ్‌‌జీ ఉన్నారు. ఆయన తన సంపదలో అత్యధిక భాగం ఛారిటీలకు ఇచ్చేయడంతో, ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్‌‌లో రెండవ స్థానం నుంచి 17వ స్థానానికి పడిపోయారు. ప్రేమ్‌‌జీ నికర సంపద గతేడాది 21 బిలియన్ డాలర్లు అంటే రూ.1,49,084 కోట్లు ఉంటే.. ఈ ఏడాది అది 7.2 బిలియన్ డాలర్లకు(రూ.51,125 కోట్లకు) తగ్గిపోయింది.