ప్రపంచంలోని కార్ల మార్కెట్లలో భారతదేశం చాలా విభిన్నం అని ఫోర్డ్ కంపెనీ సీఈఓ జిమ్ ఫార్లీ అన్నారు. ముఖ్యంగా ఇక్కడ డ్రైవర్లు హారన్లను వాడే విధానం, వాటికి ఉండే డిమాండ్ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక చిన్న వీడియోలో.. ప్రపంచంలోనే అత్యంత గట్టిగా, ఎక్కువ కాలం మన్నే హారన్లు ఇండియాలోనే అవసరమవుతాయని ఆయన చెప్పారు.
ఎక్కువ కాలం మన్నేలా.. గట్టిగా మోగేలా..
వీడియోలో ఫార్లీ ఒక ప్రశ్న అడుగుతూ మాట్లాడారు... "ప్రపంచంలో ఏ దేశానికి అత్యంత గట్టి హారన్ డిజైన్ అవసరం..?"
కొన్ని దేశాల్లో హారన్లను కేవలం ప్రమాదాలు జరగకుండా చూసుకోవడానికి, ఎప్పుడో ఒకసారి మాత్రమే వాడతారని ఆయన చెప్పారు. కానీ ఇండియాలో మాత్రం పరిస్థితి వేరు. ఇక్కడి హారన్లు చాలా బలంగా ఉండాలి, ఎక్కువ కాలం పాడవకుండా పని చేయాలి, అలాగే వేరే దేశాల కంటే చాలా ఎక్కువగా మోగాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రశ్నకు సమాధానం "ఇండియా" అని ఆయనే చెప్పారు.
హారన్ కొట్టడం ఇక్కడ ఒక అలవాటు
విదేశాల్లో అనవసరంగా హారన్ కొడితే తప్పుగా చూస్తారు. కానీ భారతదేశంలో రోడ్డుపై వెళ్లేటప్పుడు తోటి డ్రైవర్లతో మాట్లాడటానికి, సైడ్ అడగటానికి లేదా ట్రాఫిక్‌లో ముందుకు వెళ్లడానికి హారన్ కొట్టడం ఒక సాధారణ అలవాటుగా మారిపోయిందని ఫార్లీ వివరించారు. ఇక్కడ ప్రతిరోజు డ్రైవింగ్‌లో హారన్ అనేది ఒక ముఖ్యమైన భాగం.
ట్రక్కులపై ఉండే స్పెషల్ మెసేజ్
ఈ చర్చలో మన దేశంలోని ట్రక్కుల వెనుక భాగంలో కనిపించే "హార్న్ ఓకే ప్లీజ్" అనే బోర్డుల గురించి కూడా మాట్లాడుకున్నారు. వేరే వాహనాలను ఓవర్‌టేక్ చేసేటప్పుడు హారన్ కొట్టమని చెప్పడానికే వీటిని రాస్తారని పేర్కొన్నారు. అంతేకాదు, ఇండియాలోని వాహనాలకు మామూలు హారన్లతో పాటు, సైడ్ అడగడానికి ప్రత్యేకమైన 'పాసింగ్ హారన్లు' కూడా ఉంటాయని చెప్పారు.
►ALSO READ | దీర్ఘకాల పెట్టుబడులతోనే మేలు..సహనంతోనే సంపద సృష్టి..ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ రిపోర్ట్
కంపెనీలకు ఇదొక సవాల్
ఏదైనా ఒక దేశంలో కార్లను అమ్మాలనుకున్నప్పుడు.. అక్కడి ప్రజల డ్రైవింగ్ అలవాట్లకు, సంస్కృతికి తగ్గట్టుగా కార్ల విడిభాగాలను తయారు చేయాల్సి ఉంటుంది. ఫోర్డ్ లాంటి పెద్ద కంపెనీలు భారతదేశం లాంటి మార్కెట్ కోసం కార్లను తయారు చేసేటప్పుడు, ఇక్కడి భారీ వినియోగాన్ని తట్టుకునేలా హారన్లను మరింత బలంగా డిజైన్ చేయాల్సి వస్తుందని ఫార్లీ అభిప్రాయపడ్డారు. గ్లోబల్ మార్కెట్లలో వాహనాలను సక్సెస్ చేయాలంటే స్థానిక అలవాట్లను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఈ విషయం స్పష్టం చేస్తోంది.
