
- ఒక్క శుక్రవారం సెషన్‌లో నికరంగా రూ.8,831 కోట్లు ఇన్వెస్ట్ చేశారు
- ఇదే టైమ్‌లో 4 శాతం ర్యాలీ చేసిన నిఫ్టీ
- డిఫెన్స్ కంపెనీల్లోకి భారీగా పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్) డేటా ప్రకారం, మే 12 నుంచి మే 16 మధ్య ఎఫ్‌పీఐలు ఇండియన్ ఈక్విటీస్‌లో నికరంగా రూ.4,452.3 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. మే 16న అత్యధికంగా నికరంగా రూ.8,831 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. కానీ, మే 13న రూ.2,388 కోట్లను వెనక్కి తీసుకున్నారు.
దీనిని బట్టి ఇన్వెస్టర్లు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకున్నారనో లేక అనిశ్చితిలో ఉన్నారనో అర్థం చేసుకోవచ్చు. మే 2025లో ఇప్పటివరకు ఎఫ్‌పీఐల పెట్టుబడులు నికరంగా రూ.18,620 కోట్లకు చేరాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా మార్కెట్‌లో నికర కొనుగోలుదారులుగా మారారు.
ఈ ట్రెండ్ మే నెలలో కూడా కొనసాగుతోంది. ఏప్రిల్‌లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.4,223 కోట్లను షేర్లలో పెట్టారు. ఈ ఏడాది మొదట్లో జనవరిలో నికరంగా రూ.78,027 కోట్లను, ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లను , మార్చిలో రూ.3,973 కోట్లను విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా స్టాక్ మార్కెట్ నుంచి విత్‌డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటివరకు చూస్తే, విదేశీ ఇన్వెస్టర్ల నెట్ ఔట్‌ఫ్లో రూ.93,731 కోట్లుగా ఉంది. ఏప్రిల్, మేలో వచ్చిన తాజా పెట్టుబడులు చూస్తుంటే, ఇండియా మార్కెట్‌పై ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ పెరిగినట్టు కనిపిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉండడం, గ్లోబల్ ఆందోళనలు తగ్గడమే ఇందుకు కారణం.
ఎఫ్‌పీఐలు ఈ నెల 16న (శుక్రవారం) నికరంగా రూ.8,831 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఇదే టైమ్‌లో డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (డీఐఐల) నికరంగా రూ. 5,187 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. కానీ, సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్‌లు పెద్దగా పెరగలేదు. దీనిని బట్టి ఇన్వెస్టర్లు మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో పెట్టుబడులు పెంచుతున్నారని అర్థం చేసుకోవచ్చు.
మార్కెట్లు జూమ్..
ఎఫ్‌ఐఐలు తిరిగి వచ్చినప్పటి నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగిన టైమ్‌లో కూడా బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీ పెద్దగా పడలేదు. ఇరు దేశాల మధ్య సీజ్‌ఫైర్ ఒప్పందం జరిగాక ఇండెక్స్‌లు ర్యాలీ చేశాయి. కిందటి వారం మార్కెట్ పెరగడానికి ఇదే కారణం. దీంతో పాటు అమెరికా, చైనా..ఇరు దేశాలు ఒకరిపై ఒకరు టారిఫ్‌లు తగ్గించుకోవడం, వీటి మధ్య ట్రేడ్ డీల్ చర్చలు మొదలు కావడంతో మార్కెట్లు పెరుగుతున్నాయి. ఈ నెల 12–16 మధ్య సెన్సెక్స్ 3.61 శాతం (2,876 పాయింట్స్), నిఫ్టీ 4.21 శాతం (1,011.8 పాయింట్స్) లాభపడ్డాయి.
సెక్టోరల్‌గా చూస్తే, డిఫెన్స్ (17 శాతం), క్యాపిటల్ మార్కెట్స్ (11.50 శాతం), రియల్టీ (10.85 శాతం) ఇండెక్స్‌లు అదరగొట్టాయి. పారస్ డిఫెన్స్ (18.90 శాతం), డేటా ప్యాటర్న్స్ (9.25శాతం), ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ (7.10శాతం) లాంటి స్టాక్స్ ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలిచ్చాయి. ఆపరేషన్ సిందూర్‌లో ఇండియన్ డిఫెన్స్ కంపెనీలు తయారు చేసిన డ్రోన్లు, మిస్సైల్స్ మంచి పెర్ఫార్మెన్స్ చేశాయి. దీంతో ఈ కంపెనీల్లోకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి.
పాజిటివ్ మూమెంటమ్ ఉన్నప్పటికీ, 2025లో ఎఫ్‌పీఐలు ఇంకా నికర అమ్మకందారులుగా ఉన్నారని ఎనలిస్టులు చెబుతున్నారు. గ్లోబల్ అనిశ్చితులు కొనసాగడమే ఇందుకు కారణమని, యూఎస్ బాండ్ యీల్డ్స్ పెరగడంతో ఇన్వెస్టర్లు అటువైపు ఆకర్షితులవుతున్నారని వివరించారు.