మెదక్/నర్సాపూర్, వెలుగు: మెదక్ జిల్లాలో నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్ లో మంగళవారం రూ.40 లక్షల విలువైన విదేశీ మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. పక్కా సమాచారంతో కాగజ్ మద్దూర్ గ్రామ శివారులో మూతబడిన బయో మెడికల్ ఫ్యాక్టరీ వద్ద తనిఖీ చేయగా, అక్కడ రహస్యంగా నిల్వ చేసిన 783 కాటన్ల(587.25 లీటర్ల) మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి.
మద్యం విలువ రూ.40 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ ఆఫీసర్లు తెలిపారు. విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో వివిధ రాష్ట్రాలకు చెందిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో నర్సాపూర్ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.
