దేశీయ వర్సిటీల్లో బీసీ స్టూడెంట్లకు విదేశీ విద్యాసాయం:గంగుల

దేశీయ వర్సిటీల్లో బీసీ స్టూడెంట్లకు విదేశీ విద్యాసాయం:గంగుల

10వేల మందికి లబ్ధి  
హైదరాబాద్, వెలుగు: విదేశీ యూనివర్సిటీలతో పాటు దేశంలోని పేరొందిన విశ్వ విద్యాలయాల్లో చదువుతున్న బీసీ స్టూడెంట్స్​కు పూర్తి ఫీజు చెల్లించేందుకు నిర్ణయించామని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. విదేశీ విద్యా సాయం పథకాన్ని విస్తరింపజేస్తున్నామని తెలిపారు. ఇప్పటి దాకా విదేశీ వర్సిటీల్లో చదువుకునే బీసీ స్టూడెంట్స్​కు మాత్రమే ఫీజు చెల్లించేవాళ్లమన్నారు. ఇక నుంచి ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ వర్సిటీలు సహా 200కు పైగా ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు, ఇన్​స్టిట్యూట్​లలో చదువుకున్న వాళ్లకు కూడా ఈ స్కీమ్ వర్తింపజేస్తామని ప్రకటించారు.

ALSO READ :హైదరాబాద్ సిటీకి ఆరెంజ్ అలర్ట్

ఈమేరకు సీట్లు పొందిన స్టూడెంట్స్​కు పూర్తి ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను గంగుల ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియెట్​లో విద్యా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఏటా పదివేల మంది స్టూడెంట్స్​కు సాయం అందిస్తామన్నారు. దీని కోసం ప్రభుత్వంపై అదనంగా రూ.150 కోట్ల భారం పడుతుందని తెలిపారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్​కు మాత్రమే దేశంలోని యూనివర్సిటీల్లో చదువుకుంటే పూర్తి ఫీజు చెల్లిస్తున్నామని వివరించారు. ఇప్పుడు దాన్ని బీసీలకు కూడా వర్తింపజేస్తున్నామన్నారు. 

 

దీంతో బీసీ స్టూడెంట్స్​కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పూర్తి ఫీజులను చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వంగా తెలంగాణ నిలుస్తున్నదని తెలిపారు. బీసీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఆసరా పింఛన్లు, రైతుబంధు, ఫ్రీ కరెంట్ సహా వివిధ పథకాల్లో బీసీలకే మెజార్టీ వాటా దక్కుతున్నదని తెలిపారు. దాంతో పాటు వేల కోట్ల రూపాయలతో ఆత్మగౌరవ భవనాలు, ఊర్లు, పట్టణాల్లో కమ్యూనిటీ హాళ్లను నిర్మించి ఇస్తున్నామన్నారు. కుల వృత్తిదారులను ఆర్థికంగా ఆదుకునేందుకు రూ.లక్ష సాయం చేస్తున్నామని తెలిపారు.