ఇండియాకు విదేశీ టీకాలకు మూడ్రోజుల్లో అనుమతి

ఇండియాకు విదేశీ టీకాలకు మూడ్రోజుల్లో అనుమతి
  •    పర్మిషన్ ప్రాసెస్‌‌‌‌ను వేగవంతం చేసిన కేంద్రం 
  •     గైడ్‌లైన్స్ రిలీజ్ చేసిన ఆరోగ్య శాఖ 

 కరోనా కేసులు పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ టీకాలకు అత్యవసర వినియోగం కింద అనుమతి ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసింది. ఫారిన్ వ్యాక్సిన్లకు కేవలం మూడ్రోజుల్లోనే పర్మిషన్ ఇవ్వనున్నట్లు గురువారం వెల్లడించింది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్ సీఓ) తయారు చేసింది. వాటిని కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసింది. దీంతో అత్యవసర వినియోగం కింద అమెరికా, యూరప్, బ్రిటన్, జపాన్ దేశాల్లో, డబ్ల్యూహెచ్ఓ అనుమతి పొందిన టీకాలు మన దేశంలోకి రావడానికి అవకాశం కల్పించింది. ‘‘ఫారిన్ కంపెనీ టీకాకు అనుమతి కోసం ఇండియాలో ఒప్పందం చేసుకున్న సంస్థ ద్వారా గానీ, ఏజెంట్ ద్వారా గానీ సీడీఎస్ సీఓకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ అప్లికేషన్లను సీడీఎస్ సీఓ పరిశీలించి, టీకా ఎమర్జెన్సీ వినియోగానికి పనికి వస్తుందో లేదో తేలుస్తుంది. సీడీఎస్ సీఓపై ఇచ్చే రిపోర్టు ఆధారంగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నిర్ణయం తీసుకుంటుంది. ఇదంతా కంపెనీ అప్లికేషన్ పెట్టుకున్న మూడ్రోజుల్లోనే అయిపోతుంది” అని కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. డీసీజీఐ అనుమతి పొందిన కంపెనీలు నేషనల్ కొవిడ్ –19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ రూల్స్ కు అనుగుణంగా వ్యాక్సిన్లను పంపిణీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. మొదట100 మంది లబ్ధిదారులకు టీకా ఇచ్చి, 7 రోజుల వరకు పరిశీలించాల్సి ఉంటుందని తెలిపింది. అనుమతి పొందిన కంపెనీ 30 రోజుల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంటుందని చెప్పింది. 

ప్రస్తుతం ఇలా... 

ప్రస్తుత ప్రొటోకాల్ ప్రకారం.. ముందుగా కంపెనీ సెంట్రల్ డ్రగ్స్ లేబోరేటరీ (సీడీఎల్) అనుమతితో 100 మందికి టీకా ఇవ్వాలి. ఆ డేటాను సీడీఎస్ సీఓకు అందజేయాలి. దానిపై సీడీఎస్‌‌‌‌సీఓ సంతృప్తి చెందితే క్లినికల్ ట్రయల్స్‌‌‌‌కు అనుమతిస్తుంది. సీడీఎస్‌‌‌‌సీఓ చెప్పిన టైమ్‌‌లోగా ట్రయల్స్ నిర్వహించాలి. ట్రయల్స్‌‌ డేటాపై డీసీజీఐ సమీక్షించి టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలా? లేదా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది.