ఫారెస్ట్ క్లియరెన్స్ రాక.. ఏజెన్సీలో ఆగిన పనులు

ఫారెస్ట్ క్లియరెన్స్ రాక.. ఏజెన్సీలో ఆగిన పనులు
  • నిధులు మంజూరైనా ప్రారంభం కాని రోడ్ల నిర్మాణాలు
  • తిప్పలు పడుతున్న ప్రజలు.. పట్టించుకోని ఆఫీసర్లు

మహబూబాబాద్, వెలుగు: ఏజెన్సీ ఏరియాలు ఇప్పటికే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. నిధులు మంజూరు కాక, లీడర్లు పట్టించుకోక ప్రజలకు మౌలిక సదుపాయాలు అందడం లేదు. ఇలాంటి సమయంలో ఏజెన్సీకి మంజూరైన పనులకు ఫారెస్ట్ క్లియరెన్స్ అడ్డంకిగా మారింది. నిధులు సాంక్షన్ అయినా అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో.. ఆ ఫండ్స్ మూలుగుతున్నాయి. ఇందులో మెజారిటీగా రోడ్ల నిర్మాణాలే ఉన్నాయి.

రవాణా అస్తవ్యస్తం..

మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గూడూరు, గంగారం మండలాల పరిధిలో దాదాపు 60 ఏజెన్సీ గ్రామాలు, వందకు పైగా అనుబంధ గ్రామాలు ఉన్నాయి. వీటికి ఇప్పటికీ రోడ్డు సదుపాయం లేదు. చాలా గ్రామాలకు మట్టిరోడ్లే దిక్కు. వాగులపై వంతెనలు కూడా లేవు. వానాకాలంలో రోడ్ల వెంట నడవాలన్నా, వాగులు దాటాలన్నా  నరకమే. ఇక్కడి ప్రజల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తున్నాయి. కానీ ఆఫీసర్ల సమన్వయ లోపం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు. మధ్యలో ఫారెస్ట్ భూములు ఉండడంతో అక్కడి నుంచి క్లియరెన్స్ రావడం లేదు. ఇదే సాకుతో ఆర్ అండ్ బీ, పంచాయతీ ఆఫీసర్లు సైతం పట్టించుకోవడం లేదు.

రూ.కోట్ల నిధులు ఫ్రీజింగ్

అటవీశాఖ పర్మిషన్ రాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు ఫ్రీజింగ్ లోనే ఉంటున్నాయి. గూడూరు నుంచి నేలవంచ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.3.08కోట్లు మంజూరు అయ్యాయి. మట్టెవాడ నుంచి వీరంపేటకు రూ.7.41కోట్లు సాంక్షన్ చేశాయి. కొత్తగూడ మండలం చెరువుముందు తండా నుంచి దొరవారి వేంపల్లె వరకు రూ.5.73కోట్లు విడుదలయ్యాయి. కొత్తగూడ నుంచి ముస్మీకి అత్యధికంగా రూ.39.82కోట్లు రిలీజ్ అయ్యాయి. కానీ ఆయా రోడ్ల నిర్మాణానికి ఫారెస్ట్ క్లియరెన్స్ రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. కొన్ని మధ్యలోనే ఆగిపోయాయి. ఐటీడీఏ పరిధిలోని కర్నెగండి–ముస్మీ, బక్కచింతలపల్లి–కిష్టాపురం, పోగులపల్లి– గోవిందాపురం, గుడిపాడు–కోమట్లగూడెం రోడ్లకు కూడా అటవీ అనుమతులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఓవైపు క్లియరెన్స్ ఉంటేనే పనులకు అనుమతి ఇస్తామని ఫారెస్ట్ ఆఫీసర్లు చెబుతుండగా.. ఇదే సాకుతో జిల్లా ఆఫీసర్లు పెండింగ్ లో పెడుతున్నారు.