ఫారెస్ట్​ భూములంటూ గుంజుకున్న ఆఫీసర్లు

ఫారెస్ట్​ భూములంటూ గుంజుకున్న ఆఫీసర్లు

మంచిర్యాల/చెన్నూర్,వెలుగు: చెన్నూర్​మండలం ఓత్కులపల్లి శివారులోని 730 సర్వేనంబర్​లో గ్రామానికి చెందిన పలువురు రైతులు నలభై సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. సుమారు 50 ఎకరాలకు1998లో అప్పటి ప్రభుత్వం అసైన్​మెంట్ పట్టాలు జారీ చేసింది. అప్పటి నుంచి రైతులు పంటలు పండించుకుంటున్నారు. తాతలు తండ్రుల కాలం నుంచి ఆ భూములపైనే ఆధారపడి బతుకుతున్నారు. 2013లో ఫారెస్ట్​ ఆఫీసర్లు మీరు అడవిని నరికి సాగు చేసుకుంటున్నారని 14 మంది రైతులపై కేసులు పెట్టి జైలుకు పంపారు. ఆ తర్వాత కూడా అదే భూమిలో పట్టా ఉన్న రైతులు సాగు చేసుకుంటున్నారు. నిరుడు వానాకాలం సీజన్​లో సైతం పత్తి పంట వేశారు.

పంటకాలం పూర్తికాగానే మార్చిలో ఫారెస్ట్​ ఆఫీసర్లు పోలీస్​ ఫోర్స్, రెవెన్యూ ఆఫీసర్ల సహాయంతో వచ్చి భూములను స్వాధీనం చేసుకున్నారు. జేసీబీలతో ట్రెంచ్​కొట్టారు. అడ్డుకోబోయిన రైతులపై కేసులు పెట్టి జైలుకు పంపారు. మళ్లీ ఈ భూముల్లో అడుగుపెడితే నాన్​ బెయిలబుల్​ కేసులు పెట్టి మల్లీ జైలుకు పంపుతామని హెచ్చరించారు. వర్షాకాలం స్టార్ట్​ అయినప్పటి నుంచి సదరు భూముల్లో మొక్కలు నాటుతున్నారు. మరోవైపు ఫారెస్ట్​ ఆఫీసర్లు భూములను గుంజుకోవడంతో తమకు బతుకుదెరువు కరువైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1998లో ప్రభుత్వం ఇచ్చిన అసైన్​మెంట్​ పట్టాలు, తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన పట్టా పాస్​బుక్​లు ఉన్నాయని, వాటిపై బ్యాంకుల్లో క్రాప్​ లోన్లు కూడా తీసుకున్నామని చెప్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు, ఎఫ్​డీవోకు పలుమార్లు కలిసినా ఫలితం లేదని చెప్తున్నారు. పట్టా పాస్​బుక్​లో ఉన్న సర్వే నంబర్లలోని భూమిని మాకు చూపించి మీరు ఏమైనా చేసుకోండని అధికారుల కాళ్లావేళ్లా పడ్డా ఏమాత్రం కనికరం చూపకుండా కేసులు పెడతామని బెదిరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. 

జాయింట్​ సర్వేతోనే క్లారిటీ...  

గతంలో రైతులు సాగు చేసుకుంటున్న భూములకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చారు. కొన్నిచోట్ల ఫారెస్ట్ భూముల్లో పట్టాలు ఇచ్చారని ఆ డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లు వాదిస్తున్నారు. రైతులకు అసైన్​మెంట్ పట్టాలు ఇచ్చినప్పటికీ హద్దులు చూపించకపోవడంతో సమస్య తలెత్తింది. చెన్నూర్​మండలంలోని ఓత్కులపల్లితో పాటు చాకెపల్లి, అస్నాద్​గ్రామాల్లో రెవెన్యూ, ఫారెస్ట్ భూములకు సంబంధించి వివాదాలు ఉన్నాయి. జాయింట్​సర్వే చేసి వివాదాలను పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు మూడేండ్లుగా చెప్తున్నారు తప్ప సర్వే ముందుకు సాగడం లేదు. జిల్లావ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాలకు సంబంధించి జాయింట్ సర్వే పెండింగ్​ఉన్నట్టు సమాచారం. జాయింట్​ సర్వే నిర్వహిస్తే తప్ప రెవెన్యూ, ఫారెస్ట్​ భూ వివాదాలకు తెరపడే ఆస్కారం లేదు.