వెటర్నరీ ఆస్పత్రికి పెద్దపులి పిల్లలు

వెటర్నరీ ఆస్పత్రికి పెద్దపులి పిల్లలు

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడాపురం గ్రామంలో  పెద్ద పులి.. నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన ఘటనలో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. అధిక వేడి దృష్ట్యా డీహైడ్రేషన్ కు గురైన పెద్ద పులికి చెందిన నాలుగు పిల్లలను ఫారెస్ట్ అధికారులు బైర్లూటి వైల్డ్ వెటర్నరీ హాస్పిటల్ కు తరలించారు. పెద్ద పులికి పుట్టిన పిల్లలు నాలుగు ఆడపులు అని చెప్పారు. పులి పిల్లలు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాత తల్లి పులి వద్దకు చేర్చే ప్రయ్నతం చేస్తామంటున్నారు ఫారెస్ట్ అధికారులు. మరోవైపు సమీప గ్రామ ప్రజలను కూడా హెచ్చరించారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. 

అంతకుముందు.. ఆత్మకూరు అటవీ డివిజన్ కొత్తపల్లి మండలంలో పెద్ద పులి పిల్లలు కలకలం రేపాయి. పెద్ద గుమ్మడాపురం గ్రామంలో నాలుగు పెద్ద పులి పిల్లలను గుర్తించిన గ్రామస్తులు... కుక్కలు దాడి చేయకుండా.. ఓ గదిలో భద్రపరిచారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలిసుకున్న చుట్టుపక్కల జనం.. పెద్దపులి పిల్లలను చూసేందుకు భారీగా తరలివస్తున్నారు.

పిల్లలకు జన్మనిచ్చిన పెద్దపులి అక్కడ ఎక్కడా లేదని.. పిల్లల కోసం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు గ్రామస్తులు. అటవీ అధికారులు వెంటనే పులి పిల్లలను గ్రామం నుంచి తరలించాలని కోరుతున్నారు. పులి అంటే అమ్మో అంటాం కదా.. పులి పిల్లలు మాత్రం చాలా ముచ్చటగా ఉన్నాయి.