మిస్టరీ ఏంటీ : భార్యను కాల్చి చంపిన రియల్ ఎస్టేట్ వ్యాపారి.. ఆ తర్వాత గుండెపోటుతో మృతి

మిస్టరీ ఏంటీ : భార్యను కాల్చి చంపిన రియల్ ఎస్టేట్ వ్యాపారి.. ఆ తర్వాత గుండెపోటుతో మృతి

మహారాష్ట్ర థానేలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. రాజకీయ నేత గణేష్ సాల్వీ సోదరుడు దిలీప్ సాల్వీ తన భార్యను తుపాకితో కాల్చిచంపాడు. అనంతరం సెప్టెంబర్ 1వ తేదీన శుక్రవారం దిలీప్ సాల్వీ గుండెపోటుతో మృతి చెందాడు. మనీషా నగర్‌లోని నేషనల్‌ హోటల్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

దిలీప్ వృత్తిరీత్యా బిల్డర్. థానే మాజీ మేయర్ గణేష్ సాల్వికి అతడు అన్నయ్య.  దిలీప్, అతని భార్య ప్రమీలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరు మాటా మాటా అనుకున్నారు. ఈ గొడవ ముదిరడంతో విచక్షణ కోల్పోయిన దిలీప్..తుపాకితో  భార్య ప్రమీలను కాల్చి చంపాడు. ఆ తర్వాత దిలీప్ సాల్వీ  గుండెపోటుకు గురయ్యాడు. 

Also Read : Krishna Janmashtami 2023 : పిల్లలకు శ్రీకృష్ణుడు గురించి ఇలా చెప్పాలి

కాల్పుల సమాచారం అందుకున్న  థానే అడిషనల్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ మహేశ్‌ పాటిల్‌, డిప్యూటీ కమిషనర్‌ గణేష్‌ గౌడే, సీనియర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ కన్హయ్య థోరట్‌ ఘటనాస్థలికి చేరుకున్నారు. రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఆస్పత్రికి తరలించారు.

అయితే దిలీప్ గుండెపోటుకు గురయ్యాడా..లేక ఆయన మృతికి మరే కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. దర్యాప్తు తర్వాత స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.