టీఎస్​పీఎస్సీ చైర్మన్​గా మాజీ డీజీపీ మహేందర్​రెడ్డి

టీఎస్​పీఎస్సీ చైర్మన్​గా మాజీ డీజీపీ మహేందర్​రెడ్డి
  • టీఎస్​పీఎస్సీ చైర్మన్​గా ..మహేందర్ రెడ్డి
  • సభ్యులుగా అనిత, రజనీ, అమీరుల్లాఖాన్, యాదయ్య, రాంమోహన్ రావు
  • రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్​ తమిళిసై ఆమోదం

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్​పీఎస్సీ)కు కొత్త టీమ్ వచ్చేసింది. కమిషన్ చైర్మన్​గా మాజీ డీజీపీ ఎం.మహేందర్​రెడ్డితో పాటు మరో ఐదుగురు సభ్యులుగా నియమితులయ్యారు. సభ్యుల్లో అనితారాజేంద్ర (రిటైర్డ్ ఐఏఎస్), అమీరుల్లాఖాన్​ (పోస్టల్ డిపార్ట్ మెంట్​ రిటైర్డ్​ఆఫీసర్), నర్రి యాదయ్య (జేఎన్టీయూ ప్రొఫెసర్), వై. రాంమోహన్ రావు (జెన్​కో ఈడీ), పాల్వాయి రజనీకుమారి (గ్రూప్ 2 ఆఫీసర్– రిజైన్డ్) ఉన్నారు. రాష్ట్ర సర్కారు చేసిన ప్రతిపాదనలకు గవర్నర్​ తమిళిసై గురువారం ఆమోదం తెలిపారు. దీంతో చైర్మన్​తోపాటు మరో ఐదుగురు సభ్యులను నియమిస్తున్నట్టు సీఎస్​ శాంతికుమారి జీవో 11 రిలీజ్ చేశారు. 

కాగా.. చైర్మన్, సభ్యుల పదవీ కాలపరిమితి ఆరేండ్లు లేదా వారి వయసు 62 ఏండ్లలో ఏది ముందుంటే అది అమలవుతుంది.  ప్రస్తుతం టీఎస్​పీఎస్సీలో అరుణకుమారి మెంబర్​గా కొనసాగుతున్నారు. మరో మెంబర్​ సుమిత్రానందన్ ఇటీవల రాజీనామా చేయగా గవర్నర్ ఇంకా ఆమోదం తెలుపలేదు. 

పాత కమిషన్ నుంచి కొత్త కమిషన్ కు

గత నెలలో రాష్ట్రంలో కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో నాటి టీఎస్​పీఎస్సీ చైర్మన్  జనార్దన్ రెడ్డి, సభ్యులు కారం రవీందర్  రెడ్డి, ఆర్.సత్యనారాయణ, బండి లింగారెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల వారి రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో కమిషన్ కొత్త బోర్డు ఏర్పాటు కోసం ఈ నెల 12న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నెల18 దాకా అర్హులైన వారి నుంచి అప్లికేషన్లు తీసుకోగా.. సుమారు 600 దాకా దరఖాస్తులు వచ్చాయి.  వీటికి సీఎస్​ శాంతికుమారి, జీఏడీ సెక్రటరీ నిర్మల, లా సెక్రటరీ తిరుపతి ఆధ్వర్యంలో స్ర్కూట్నీ ప్రక్రియ జరిగింది.  

మహేందర్ రెడ్డి: చైర్మన్ 

ఖమ్మం జిల్లా కుసు మంచి మండలం కిష్టాపురం గ్రామా నికి చెందిన మహేం దర్ రెడ్డి.. మధ్యతరగతి కుటుంబంలో 1962 డిసెంబర్ 3న జన్మించారు. వరంగల్ నిట్ లో బీటెక్, ఐఐటీ ఢిల్లీలో ఎంటెక్ పూర్తి చేశారు.1986లో ఐపీఎస్​కు సెలెక్ట్ అయ్యారు. నిజామాబాద్, కర్నూల్ ఎస్పీగా, సైబరాబాద్, హైదరాబాద్ సీపీగా, ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. 2017 నవంబర్ నుంచి 2022 డిసెంబర్ 31 వరకూ డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. టీఎస్​పీఎస్సీ చైర్మన్​గా మహేందర్​రెడ్డి 10 నెలల పాటు కొనసాగనున్నారు. 

అనితా రాజేంద్ర 

హైదరాబాద్​లోని బండ్లగూడ జాగీర్​కు చెందిన అనితా రాజేంద్ర 1963 ఫిబ్రవరి 4న జన్మించారు. ఓయూ నుంచి ఎంఏ, ఎల్​ఎల్​బీ, ఎల్​ఎల్​ఎం పట్టాలను అందుకున్నారు. 1992లో గ్రూప్1 ఆఫీసర్​గా ఉన్న ఆమె..  2004 ఐఏఎస్​గా ప్రమోషన్ పొందారు.  ఐఏఎస్ ఆఫీసర్​గా సుమారు పది శాఖల్లో పనిచేసిన అనుభవం అనితకు ఉంది. 2023 ఫిబ్రవరిలో  రిటైర్డ్ అయ్యారు.

నర్రి యాదయ్య

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన నర్రి యాదయ్య  1964 ఫిబ్రవరి 10న జన్మించారు. ఓయూలో బీఈ, ఐఐటీ ఖారగ్​ఫూర్ లో ఎంటెక్​ చేయగా, జేఎన్టీయూలో పీహెచ్​డీ పూర్తిచేశారు. జేఎన్టీయూహెచ్​ ప్రిన్సిపల్​గా, వర్సిటీ రిజిస్ట్రార్​గా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు.  ఎంసెట్ కన్వీనర్​ గా నాలుగు సార్లు, ఈసెట్​కన్వీనర్​గా రెండు సార్లు పనిచేశారు. 

రాంమోహన్ రావు

ఖమ్మం జిల్లా దేశాయనిపాలెం గ్రామానికి చెందిన రాంమోహన్ రావు 1963 ఏప్రిల్ 14న జన్మించారు. ఆయన తండ్రి  ఎంప్లాయీ కావడంతో వివిధ ప్రాంతాల్లో విద్యాభ్యాసం పూర్తిచేశారు. 1986లో ఏఈగా విద్యుత్​ శాఖలో మొదలైన రాంమోహన్​రావు ఉద్యోగ ప్రస్తానంలో వివిధ స్థాయిల్లో కొనసాగింది. ప్రస్తుతం టీఎస్​ జెన్​కోలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​గా హెడ్ క్వార్టర్​లో పనిచేస్తున్నారు. 

పాల్వాయి రజని

సూర్యాపేట పట్టణానికి చెంది న పాల్వాయి రజని కుమారి 1972 మే 17న జన్మించారు. ముందు వీడీవో, టీచర్​గా పనిచేసిన ఆమె.. ఆ తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్​అయ్యారు. తాండూరు, సూర్యాపేట మున్సిపల్  కమిషనర్​గా పనిచేసి రాజీనామా చేశారు.  

అమీరుల్లాఖాన్​

హైదరాబాద్​కు చెందిన అమీరు ల్లాఖాన్​1983లో ఇండి యన్ పోస్టల్ సర్వీస్​లో చేరారు. 1995 లో ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. అనంతరం కేంద్ర ఫైనాన్స్ శాఖ పరిధిలోని యూఎన్​డీపీ లో పనిచేశారు. ఉర్దూ వర్సిటీ, సల్సార్, ఐఎస్​బీ, ఎంసీహెచ్​ఆర్డీ తదితర వాటిల్లో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేశారు.